సాఫ్ట్‌వేర్‌ దీప్తి కేసు .. పోలీసుల అదుపులో చందన, ఆమె ప్రియుడు

జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి చెల్లి చందన, ఆమె ప్రియుడిని, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా అక్క దీప్తి చనిపోయిన రోజే చెల్లి చందన కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అందులోనూ తెల్లవారుజామున బస్టాండులో ప్రియుడితో కనిపించడం సైతం అనుమానాలకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

Also Read : రాక్షసానందం : కుక్కకు ఉరేసి.. నడి రోడ్డుపై తిప్పి తిప్పి కొట్టి కొట్టి చంపాడు..

నాలుగు రోజుల నుంచి చందన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చేపట్టారు. విదేశాలకు వెళ్లకుండా పోలీసులు ల్యూక్ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో శుక్రవారం(సెప్టెంబర్ 01) ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద చందన, ఆమె ప్రియుడు, వారికి సహకరించిన కారు డ్రైవర్‌, ఆశ్రయం కల్పించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఉన్న యువకుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇద్దరినీ కోరుట్లకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఇంకెవరైనా మద్యం తాగారా? చందన ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఏం జరిగిందంటే..

భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి, చందన, సాయి ముగ్గురు సంతానం. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తుంది. చందన బీటెక్‌ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు సాయి బెంగళూరులో ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉండటంతో ఆదివారం(ఆగస్టు 27) శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం(ఆగస్టు 28) రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం(ఆగస్టు 29) మధ్యాహ్నం ఫోన్‌ చేయగా దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. చందన ఫోన్‌ స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి శ్రీనివాస్ రెడ్డి సమాచారం ఇచ్చాడు. దీంతో వారొచ్చి చూడగా... దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్‌ బాటిల్‌, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్‌ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీప్తి శరీరంపై గాయాలున్నట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు గుర్తించారు.