హైదరాబాద్, వెలుగు: హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చందానగర్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నందగిరి సుధాంశ్ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాకుండా ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషన్‌లో కోరారు.
గతంలో వేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టి వేసిందని, అందువల్ల హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. శేరిలింగంపల్లి మండంల మదీనగూడ గ్రామంలోని ఈర్ల చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, వాటిని అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేశారు.