
అదృష్టం కొందరిని ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. అప్పుడెప్పుడో 37 ఏళ్ల క్రితం షేర్లు కొని పడేస్తే అవి ఇప్పుడు దొరికాయి. ఇళ్లు సర్దుతుంటే దొరికిన షేర్లు ఏంచేయాలో కూడా తెలియని పరిస్థితి. స్టాక్ మార్కెట్ పై అవగాహన లేని వ్యక్తికి వాళ్ల పూర్వీకులు కొని పెట్టిన షేర్ల డాక్యుమెంట్లు దొరకడం.. వీటిని విలువ ఎంతో తెలియదు.. ఎలా అమ్మాలో కూడా తెలియదని సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఈ న్యూస్.
చండీగఢ్ కు చెందిన ఒక వ్యక్తికి 37 ఏళ్ల నాటి రిలయన్స్ షేర్లు దొరికాయి. 1988లో కొన్న రిలయన్స్ షేర్ల ఫిజికల్ కాపీలు దొరకడంతతో అతని దశ తిరిగిందని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
అప్పట్లో ఒక్కో షేర్ ను 10 రూపాయల చొప్పున మొత్తం 30 షేర్లు కొన్నారు. ఆ 30 షేర్లకు సంబంధించిన ఫిజికల్ కాపీలు దొరకడంతో స్టాక్ మార్కెట్ గురించి తనకు తెలియదని పోస్ట్ చేశాడు. షేర్లను ఫోటో తీసి ఎక్స్ (ట్విట్టర్ ) లో పోస్ట్ చేశాడు రతన్ ధిల్లాన్ అనే వ్యక్తి.
అయితే స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉన్నవాళ్లు వాటి విలువ ఎంతో లెక్కగట్టి మరీ చెప్పారు. 37 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు 3 స్టాక్ స్ప్లిట్ లు, 2 బోనస్ లతో కలిపి 30 షేర్లు కాస్త 960 షేర్లు అవుతాయి. ప్రస్తుతం రిలయన్స్ షేర్ వ్యాల్యూ ప్రకారం వీటి విలువ రూ.11 నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది. డాక్యుమెంట్స్ లేదా ఆధారాలతో రిలయన్స్ సంస్థను అప్రోచ్ కావచ్చునని కొందరు సలహా ఇచ్చారు.
‘‘మీరు ఒకవేళ వారసులైతే డాక్యుమెంట్లు పూర్తి వివరాలతో ఈమెయిల్ చేసినా మీకు డబ్బులు చెల్లిస్తారు’’ అని మరి కొందరు సలహా ఇచ్చారు. ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీ షేర్లు దొరకడం లక్కీ.. మిలియనీర్ అయిపోయారు అనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేవలం 300 రూపాయలతో కొన్న షేర్లు 12 లక్షలకు పైగా విలువ చేస్తుండటంపై ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేవనుకోండి. దీనిపై కొందరు.. ‘‘ఒక్క దెబ్బకే మిలియనీర్ అయ్యావ్ పో భయ్యా..’’ అని కామెంట్స్ చేస్తున్నారు.