
‘కేసీఆర్, జగన్ ఇద్దరూ ప్రధాని మోడీ పెంపుడు కుక్కలు. మోడీ బిస్కెట్లు తిని మీదికొస్తున్నారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 100మంది మోడీలు, 500 మంది కేసీఆర్ లు, 1000మంది జగన్ లు వచ్చినా తననేమీ చేయలేరన్నారు.‘కేసీఆర్.. నన్ను సన్యాసి అంటున్నావు? మరి నువ్వుగొప్ప నాయకుడివా?. ఒళ్లు దగ్గర పెట్టుకో. నోటి కొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తా’నని హెచ్చరించారు.‘రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఏపీకి వచ్చి ఉంటే నీ కథ తేల్చేవాడిని’ అని అన్నారు. ప్రచారంలో చివరి రోజు గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, తాడికొండల్లో రోడ్ షోల్లో బాబు మాట్లాడారు. ‘కేసీఆర్ మర్యాదగా మాట వినరు. అందుకే పొగబెట్టి బయటకు లాగా. తన పార్ట్ నర్ జగన్ గెలుపు కోసం ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతు ప్రకటించారు’ అని చెప్పారు. కేసీఆర్, మోడీలకు ‘ప్రత్యేక’ భాషలో చెబితేనే అర్థమవుతుందన్నారు. ‘కేసీఆర్ నియంత. ఆయనవన్నీ ఊసరవెల్లి రాజకీయాలు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్ ను కాంగ్రెస్ లో కలుపుతామన్నారు. తెలంగాణ ఇచ్చాక సోనియాను దెయ్యం అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎంను చేస్తామన్నారు. చేశారా? అప్పడు తెలంగాణకు మోసం చేశారు. ఇప్పుడు ఏపీకి మోసంచేయాలనుకుంటున్నారు’ అని బాబు విమర్శించారు.
కేసీఆర్, జగన్ తోడు దొంగలు
ఏపీకి అన్యాయం చేస్తున్నందుకు కేంద్రంపై తాను అవిశ్వాసం పెడితే కేసీఆర్ మద్దతివ్వలేదని బాబువిమర్శించారు. “126 మంది ఎంపీలు మద్దతుప్రకటించినా వైసీపీ, టీఆర్‌ఎస్ లు సమర్థించలేదు.ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రాతో ఏం సంబంధముందని జగన్ కు కేసీఆర్ డబ్బు పంపారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. వైసీపీకి సిగ్గులేక కేసీఆర్ చెంతకు చేరింది. కేసీఆర్, జగన్ తోడు దొంగలని రుజువైంది” అని అన్నారు. జగన్ లాంటి అసమర్థుడు సీఎం అయితే రాష్ర్టం నాశనం అవుతుందన్నారు. జగన్ గెలిస్తే నాగార్జున సాగర్ , శ్రీశైలం ప్రాజెక్టులను కేసీఆర్ కబ్జా చేస్తారని ఆరోపించారు. పోలవరంపై కవిత కోర్టుకు వెళ్లిందని, జగన్ కు ఓటేస్తేమనకు నీళ్లు రావని, రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోతుందన్నారు. జగన్ కు ఓటేస్తే కేసీఆర్ పెత్తనాన్ని కొని తెచ్చుకున్నట్లేనని వ్యాఖ్యానించారు.
అమరావతిపై జగన్ స్టేట్ మెంట్ ఇవ్వాలి
రాజధానిని మార్చనని జగన్ స్టేట్ మెంట్ ఇచ్చాకే వైసీపీ అభ్యర్థి తాడికొండలో అడుగు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. “రాజధాని ప్రాంతంలో నేను ఆస్తుల విలువ పెంచితే వైసీపీ తగ్గిస్తుందా? రాజధానికి జగన్ మొదట్నుంచి వ్యతిరేకమే. జగన్ కు సీఎం పదవి వస్తే దొంగచేతికి తాళం ఇచ్చినట్లే” అనిఅన్నారు. కేసీఆర్ పంపిన సొమ్ము ను పంచి ఓట్లు కొనేప్రయత్నం చేస్తారని, ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మోడీ నియంతృత్వ పోకడలకు చెక్ పెడతా
ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే మరోసారి సుప్రీం కోర్టులో పోరాడటానికి కూడా సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు.”మోడీ జాగ్రత్తగా ఉండాలి. అధికారం ఉంది కదా అని తప్పుడు పనులు చేస్తే దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుంది. ఆయన మరోసారి గెలిస్తే దేశంలో ఎన్నికలే లేకుండా చేస్తారు. వైసీపీ పంచుతున్న డబ్బులు కేసీఆర్, మోడీ పంపినవే. ఓట్లుకొని రాష్ర్టాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ముగ్గురూ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత దేశమంతా తిరిగి మోడీ నియంతృత్వ పోకడలకు చెక్ పెడతా. మోడీకి ఓటేస్తే ముస్లింలకు భద్రత ఉండదు. ఇప్పటికే అసోంలో బర్మా ముస్లిం లంటూ లక్షల మంది మైనారిటీల ఓట్లుతొలగించారు” అని ఆరోపించారు.