
ఏపీలో ఎన్నికలను అపహాస్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో కలిసి కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఓటరు జాబితాలో అవకతకవలపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు చంద్రబాబు. ప్రజల్లో తిరుగుబాటు చూసే నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎవరిని పనిచేయకుండా చేసేందుకు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను పంపాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్నవారిని నియమించాలని ఈసీని కోరామన్నారు చంద్రబాబు.
దొంగ ఓట్లపై ఈసీ చర్యలు తీసుకోవాలని అన్నారు పవన్ కల్యాణ్. దొంగ ఓట్లు ఎలా సృష్టించారో ఈసీకి వివరించామని చెప్పారు.చంద్రగిరిలో దాదాపు లక్ష దొంగ ఓట్లు నమోదయ్యాయని అన్నారు. వాలంటీర్ వ్వవస్థ రాజ్యంగ విరుద్దమన్న పవన్.. అసెంబ్లీ ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీని కోరామన్నారు. నిస్పక్షపాతంగా ఎన్నికలు జరుగతాయని ఈసీ చెప్పిందని పవన్ వెల్లడించారు.