ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ ... A1గా చంద్రబాబు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు  స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీట్ ధాఖలు చేసింది.  ఇందులో  A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి  నారాయణ  పేరు చేర్చింది.  నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, రమేష్ లను ముద్దాయిలుగా చేర్చి్ంది.  సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందమే జరగలేదని సీఐడీ ఛార్జిషీట్ లో తెలిపింది. 

చంద్రబాబు, నారాయణ  కనుసన్నల్లోనే  వ్యవహారం మొత్తం జరిగిందని సీఐడీ పేర్కొంది.   సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు  సీఐడీ పేర్కొంది.

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గతంలో  చంద్రబాబు సర్కార్ చేపట్టింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టారీతిలో మార్పులు చేశారని  జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డును మార్పులు చేసి  అక్రమాలకు పాల్పడ్డారని  సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ విషయంలో  చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై  సీఐడీ అభియోగాలు మోపింది. తమ భూములకు విలువ పెరిగేలా  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్  మార్చారని చంద్రబాబు సర్కార్ పై  వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది.