చంద్రబాబుకు ఈసారి దక్కింది 23 మంది ఎమ్మెల్యేలే. గతంలో వైఎస్ఆర్ సీపీ నుంచి 23 మందిని తమ పార్టీలోకి లాక్కున్నందువల్ల జనం ఆ 23 మందినే ఈసారి గెలిపించారని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాని ఎంతవరకు నెట్టుకొస్తారన్నదికూడా అనుమానంగానే ఉంది. గతంలో మాదిరిగా మంచి వక్తలు, వివిధ అంశాలపై పట్టున్నవారు ఈసారి ఎవరూ నెగ్గలేదని చెబుతున్నారు. అంతా తానే అయినట్లుగా ప్రవర్తించడంవల్ల చివరకు తన ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటూ తమ పార్టీని బతికించుకోవలసిన బాధ్యత బాబు పైనే ఉందంటున్నారు.
అయిదేళ్లపాటు పూర్తి పదవీ కాలాన్ని ముఖ్యమంత్రి సీటులో గడిపిన నారా చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారారు. అయన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అపోజిషన్‌లో ఉండడం కొత్తేమీ కాదు. కాకపోతే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రెండు సందర్భాల్లోనూ.. 2004లో 47 సీట్లు, 2009లో 92 సీట్లు ఉండేవి. సభలో అధికార పార్టీని ఢీ కొట్టడానికి తగిన సమర్థులైన నాయకులు చుట్టూ ఉండేవారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా.. గెలిచిన 47 మందిలో దేవేందర్ గౌడ్, పరిటాల రవీంద్ర, యనమల రామకృష్ణ, పయ్యావుల కేశవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి వాగ్ధాటిగలవాళ్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాగే 2009లోనూ ఓటమిపాలైనా.. గెలిచిన 92 మందిలో పోచారం శ్రీనివాసరెడ్డి, వేణుగోపాలాచారి, రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, అశోక్ గజపతి రాజు, ధూళిసాళ నరేంద్రకుమార్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలాంటి వాళ్లున్నారు. వీట్లలో చాలామంది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరిపోవడమో, లేదా తెలంగాణ ఆవిర్భావంతో అక్కడి అసెంబ్లీకి ఎన్నిక కావడమో జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో రక్షణగా నిలబడే వాక్ సత్తా కలిగినవాళ్లు కరువయ్యారు.
1989 నుంచి 1994 వరకు తెలుగు దేశం పార్టీ అధికారానికి దూరమైంది. ఆ సమయంలో పార్టీ అధ్యక్షుడు ఎన్.టి.రామారావు మరలాసినీ రంగంలో తన డ్రీమ్ ప్రాజెక్టులైన సామ్రాట్ అశోక్, శ్రీనాథ కవిసార్వభౌముడు వంటి సినిమాలు చేసుకున్నారు. అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ హెరిటేజ్ ప్రాజెక్టుకి ఎక్కువగా సమయం కేటాయించారు. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించడానికి, అసెంబ్లీలో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి తగిన లీడర్లు ఉండేవారు. పార్టీని నమ్ముకుని చివరివరకు కొనసాగినవాళ్లే ఎక్కువ. ఆ తరం దాదాపుగా ముగిసిపోయింది. 2014 తర్వాత పార్టీ ఫిరాయింపులనేవి చాలా తేలిగ్గా జరిగిపోతున్నాయి. వెళ్లేవాళ్లకు అడ్డు ఉండడం లేదు. చేర్చుకునేవాళ్లకు మోరల్ రెస్పాన్స్‌బిలిటీ అసలే కనబడడం లేదు. స్వయంగా చంద్రబాబునాయుడే 2014లో గెలిచిన 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. అందువల్ల, ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచిన 23 మందిని నిలుపుకోవడం కూడా చంద్రబాబుకు కష్టమే. అయితే, పదవులు వదులుకుంటేనే పార్టీలో చేర్చుకుంటామని వైసీపీ అధనేత, ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత రూల్ పెట్టుకున్నారు కాబట్టి, ఇప్పటికిప్పుడు ఎవరూ తెలుగుదేశం గోడ దూకకపోవచ్చు.
ఇక, చంద్రబాబు పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాలపై ఇప్పటికే వివాదాలు నడుస్తున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరుతో గోదావరి నీళ్లను కృష్ణానదిలోకి తరలించడంపై ఇప్పటికే గోదావరి జిల్లాలవాళ్లు, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగంలో తీవ్ర అసంతృప్తి పేరుకుంది. నీటి సహజమార్గాన్ని మళ్లించడమే కాంకుండా, గోదావరిలో తమకు దక్కాల్సిన నీళ్లను కృష్ణా డెల్టాకోసం తీసుకుపోతున్నారని అనేక సార్లు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈ విషయంలో కొత్త వాదాన్ని తీసుకొచ్చారు. రాయలసీమ రైతాంగానికి సాగునీళ్లు, ప్రజలకు తాగు నీళ్లు ఇవ్వాలంటే కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి మళ్లించాల్సి ఉంటుందని, తెలంగాణకు ఇవ్వాల్సిన నీటి వాటాను కొనసాగించాలని, కాబట్టి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మళ్లించే
నీళ్లలో కృష్ణా డెల్టా నష్జపోకుండా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నామని చెప్పుకొచ్చారు. గోదావరి డెల్టా ప్రాంతానికి, రాయలసీమకు నడుమ చిచ్చు పెట్టడానికి తప్ప మరొకటి కాదని అక్కడి వేర్పాటువాదులు గడచిన నాలుగేళ్లుగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. నిజానికి, శ్రీశైలంలో 880 అడుగుల నీటి మట్టం ఉండాలన్న నిబంధనను ఉల్లంఘించడంవల్లనే
పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందడం లేదని చెబుతున్నారు.
అదే విధంగా, చంద్రన్న బీమా, చంద్రన్న కానుక వంటి వివిధ పథకాలను చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారు. వీటికోసం కోట్లాది రూపాయల్ని ఖర్చుచేసినా, ప్రచారం చేసినంతగా ఫలితం దక్కలేదన్న ఆరోపణలున్నాయి. కొత్త రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబునాయుడు ఇంజనీర్లకంటే గ్రాఫిక్ డిజైనర్లపైనే ఎక్కువగా ఆధారపడ్డారని వైఎస్ఆర్సీపీ పదే పదే విమర్శించింది. ‘అమరావతి కాదు, భ్రమరావతి’ అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబును, ఆయన పనులను బాగా ట్రోల్ చేశారు. ఈ డిజైన్లకోసం ఆయన పెట్టిన ఖర్చుకూడా కోట్లలోనే ఉంది. తాత్కాలిక రాజధానిలో నిర్మించినవన్నీ చాలా నాసిరకమని, వర్షం వస్తే చాలు గదుల్లోకి నీళ్లు చేరుకుంటున్నాయని అనేక ఆధారాలతో విమర్శించారు.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెడితే.. ప్రతి ఒక్క విషయంలోనూ తప్పులు ఎత్తిచూపుతారనే సందేహం తెలుగుదేశం పార్టీలో ఉందంటున్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ చేసే విమర్శలకు తమ దగ్గర జవాబు ఏవీ లేవంటున్నాయి టీడీపీ వర్గాలు. అదీగాక, ఈసారి నెగ్గినవాళ్లలో కాస్తో కూస్తో సబ్జెక్ట్‌పై అవగాహన, వాక్చాతుర్యం ఉన్నవాళ్లెవరూ లేరనికూడా అక్కడి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి గెలిచిన 23మందిలో చంద్రబాబునాయుడును మినహాయిస్తే.. కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు లాంటి అరడజన్ మందికి మించి కనబడడం లేదని అసెంబ్లీ వ్యవహారాల్లో ఆరితేరినవారు
విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ హిందూపురంలో మళ్లీ గెలిచినాగానీ, ఆయనను సిరియస్ పొలిటీషియన్‌గా గుర్తించడం లేదు. పైగా బాలకృష్ణకు సబ్జెక్ట్‌పై ఎలాంటి అవగాహనగానీ, ఉపన్యాసంపై పట్టుగానీ ఉండవన్నది మరో ఆక్షేపణ. ఇన్ని బ్యాక్డ్రాప్లున్నందువల్ల
చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ఎంతవరకు చాకచక్యంగా తమ పార్టీని, తమ అయిదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను సమర్థించుకుంటూ నెట్టుకొస్తారో చూడాలి.
తండ్రీ కొడుకులిద్దరి పాలనలోనూ అపోజిషనే!…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నాగానీ, సొంతంగా గెలిచింది మాత్రం 1999 ఎన్నికల్లోనే. అంతకుముందు ఎన్‌టీఆర్ సాధించిన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, అధికారం దక్కించుకున్నారు.
మొదటిసారి ఎన్నికల్లో గెలిచి అయిదేళ్లు పాలించాక… అధికారాన్ని వై.ఎస్.రాజశేఖరరెడ్డికి అప్పగించేసి, ప్రతిపక్షంలో కూర్చున్నారు చంద్రబాబు. ఆ అయిదేళ్లలోనూ వైఎస్ అసెంబ్లీలో చేసిన దెప్పిపొడుపులు, ఆక్షేపణలకు టీడీపీ నుంచి తిప్పికొట్టలేక ఇబ్బంది పడేవారు.
రెండోసారి రాష్ట్రం విడిపోయాక 2014 ఎన్నికల్లో అధికారానికొచ్చారు. అయిదేళ్లు పాలించాక… అధికారాన్ని వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డికి అప్పగించేసి, మరోసారి ప్రతిపక్షంలో కూర్చుంటున్నారు. మరి, వచ్చే అయిదేళ్లలో అసెంబ్లీలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేసే ఆరోపణలకు, ఎత్తిచూపించే తప్పులకు ఎలా సమాధానమిస్తారో చూడాలి.