చంద్రబాబు కూడా కేసీఆర్ నే కాపీ కొడుతున్నారు : KTR

వరంగల్ : 71  ఏళ్ల దేశ చరిత్రలోనే రైతుల కష్టాలను పట్టించుకున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మాత్రమే అని చెప్పారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. దేశం‌లోని 28 రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులు కూడా కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్నారని… మన రైతుబంధు పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టడం కేసీఆర్ ప్రతిభకు నిదర్శనం అన్నారు. మిషన్ కాకతీయను 11 రాష్ట్రాలలో అమలు చేస్తున్నారనీ.. మోడీ ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ యోజనకు కూడా రైతుబంధు మూలం అన్నారు.

ఏడాదిలో సజీవ జలదృశ్యం ఆవిష్కరిస్తాం 

“వరంగల్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం. జయశంకర్ సార్ మొబైల్ ఎన్‌సైక్లోపీడియా. జయశంకర్ సార్ చెప్పినట్లు ఢిల్లీని శాసించే పరిస్థితి వచ్చింది. సంక్షేమ పథకాలకు, సంక్షేమ‌రంగానికి కేసీఆర్ పాలన స్వర్ణ యుగం. రాష్ట్ర రాజముద్రికలో, చెరువుల పునరుద్ధరణ పథకంలో, కాకతీయ తోరణంకు స్థానమిచ్చి అరుదైన గౌరవమిచ్చిన ఘనత కేసీఆర్ దే. హైదరాబాద్ తర్వాత వరంగల్ కు ప్రాధాన్యమిస్తూ అధిక నిధులిచ్చారు. వ్యాగన్ పరిశ్రమకు అవసరమైన రూ.28 కోట్లను చెల్లించే ప్రయత్నం‌ చేస్తాం. సజీవ జల దృశ్యాన్ని సంవత్సర కాలంలో ఆవిష్కరించబోతున్నాం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కాంగ్ర్రెస్, బీజేపీ రెండూ లేవు. 16 సీట్లు గెలుచుకుంటేనే మనకు కేంద్ర నిధులు వస్తాయి. గజ్వేల్ సభలో కేసీఆర్ మా పాలమూరు, కాళేశ్వరం కు నిధులు కావాలని పిఎం‌ మోదీని అడిగారు. ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారు తప్ప మోడీ చేసిందేం‌లేదు” అన్నారు కేటీఆర్.

మోడీ ఉపన్యాసాలు దంచుతున్నాడు తప్ప చేసేదేంలేదు 

“2014లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. నరేంద్రమోడీ ఏదో చేస్తారనుకున్నారు. కానీ ఉపన్యాసాలు తప్ప చేసిందేం‌లేదు. బీజేపీకి ఈ సారి ఎదురుదెబ్బ తప్పదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దెబ్బతిన్న బీజేపీ ఇప్పుడు ఎన్నికల్లో చతికిలపడక తప్పదు. ఎన్డీయే రాబోయే ఎన్నికల్లో 150 సీట్లు గెలుచుకోవడం కష్టమే. కాంగ్రెస్ కు కూడా రావు. ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చోవాలో టీఆర్ఎస్ డిసైడ్ చేసే పరిస్థితి రావాలి. యాచించడం‌కాదు శాసించి తెచ్చుకోవాలి. ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఢిల్లీ చెవులుపిండి నిధులు తెచ్చుకుందాం. కాంగ్రెస్ కు టికెట్ కావాలన్నా.. బి ఫామ్‌కావాలన్నా.. ఆఖరుకు బాత్రూమ్‌పోవాలన్నా ఢిల్లీ కావాలి. రాహుల్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్…  కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్లే.  కాంగ్రెస్, బీజేపీలు కాదు.. అనుకూల పార్టీలను కలుపుకొని ఢిల్లీని శాసిద్దాం. ఎన్నికల్లో ఐదు లక్షల మెజార్టీ రావాలి” అని కేటీఆర్ అన్నారు.