
ఏపీలో జరగనున్న ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ టీడీపీయే తప్ప జగన్ వర్సెస్ టీడీపీ కాదు. ‘జగన్ ఫెయిలయ్యాడు. నేనే రంగంలో దిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ’ అని కేసీఆర్ ఎప్పుడో అన్నాడు. నేను చాలెంజ్ చేస్తున్నా. కేసీఆర్ రావాలి, కేటీఆర్ రావాలి. ఇంకా మీ మనుషులెవరైనా ఉంటే అందర్నీ పంపు. తేలుద్దాం. కేసీఆర్ కావాలో, టీడీపీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన టైమొచ్చింది.
ఏపీలో జరగనున్న ఎన్నికలు కేసీఆర్, టీడీపీ మధ్యేనని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఏపీలో ప్రతిపక్షం లేదు.. వస్తాను, తేల్చుకుంటాను’ అని కేసీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ కావాలా.. టీడీపీ కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఏపీ ప్రజలను కేసీఆర్ ఎన్నో రకాలుగా అవమానించారన్నారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన బకాయిలను తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన గాయాలపై కారంపూసి ఆనందిస్తున్నారని ఆరోపించారు.
డేటా చోరీపై శనివారం అమరావతిలో మీడియాతో బాబు మాట్లాడారు. ‘‘ఏపీపై ముగ్గురు మోడీలు కుట్రకు తెరలేపారు. టీడీపీని నిర్వీర్యం చేసేందుకు ఢిల్లీలో స్కెచ్ వేశారు. బాహుబలి సినిమాలో కూడా ఇంత దారుణమైన కుట్ర చూడలేదు. తప్పుడు పనులు చేస్తూ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు. ఈ కుట్రలో ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి. వీరికి పొరుగు రాష్ట్రం సహకరించింది. విజయసాయిరెడ్డి డైరెక్షన్ కుట్రపన్నారు.
డేటా పోయిందని అర్ధరాత్రి ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? ఏపీ డేటా పోతే ముందు మాకెందుకు చెప్పలేదు? ఫిబ్రవరి 19న ఈసీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. 22న యాక్షన్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దారు. 23న ఐటీ గ్రిడ్స్ పై దాడిచేసి డేటా దొంగలించారు. మా డేటా దొంగిలించి మాపైనే కేసులు పెడతారా? ఎస్‌ఆర్ నగర్ పీఎస్ దినేశ్ రెడ్డితో ఎందుకు కంప్లైంట్ ఇప్పించారు? ఐటీ గ్రిడ్స్ పై కంప్లైంట్ ముందు దాడులు చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర కూడా ఒప్పుకున్నారు’’ అన్నారు.
కేసులు పెడితే భయ పడేవారు ఎవరూ లేరన్నారు. ఫామ్-7 అనేది అతి పెద్ద నేరమన్నారు. ఇది ఆంధ్రా వ్యవహారం, ఓట్ల సంగతి చూడాల్సింది కూడా ఏపీలోని ఎన్నికల అధికారి అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏంసంబంధం అని చంద్రబాబు ప్రశ్నించారు.