వై.సి.పి అధ్యక్షుడు జగన్ ను తీవ్రంగా విమర్శించారు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ పేరు లోనే ‘గన్’ ఉందని విమర్శించారు. జగన్ కు ఎప్పుడూ నేరాలు, ఘోరాలేనని, ఎప్పుడేం కుట్రలు చేస్తారో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. కొందరు కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో ఆంధ్ర ప్రదేశ్ అల్లాడినప్పుడు కనబడని మోహన్‌బాబు, జయసుధ, అలీ లాంటి నటులు ఎన్నికల వేళ వలసపక్షుల్లా వాలారని మండిపడ్డారు. కేసీఆర్‌కి భయపడి హైదరాబాద్ నుంచి వచ్చి ఏపీలో పెత్తనం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలే తనకు శ్రీరామ రక్ష అని… వారే తనకు పోలీసు వలయంగా మారి రక్షించుకోవాలని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని ఉగ్రవాదిగా అభివర్ణించారు చంద్రబాబు నాయుడు. గోద్రా అల్లర్లలో 2వేల మంది మృతికి మోడీనే కారకుడని ఆరోపించారు. పదవిలోకి రాగానే కొమ్ములు వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీని ఢిల్లీ నుంచి గుజరాత్‌కు పంపించే వరకు వదిలిపెట్టనన్నారు. రాష్ట్రంలో దుర్మార్గుల ఆటలు సాగనీయబోమని, కుట్రదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోడీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కోడికత్తి పార్టీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనన్నారు. జగన్‌కు మోడీ, కేసీఆర్ నుంచి కోట్లకొద్ది ధనం వస్తుందని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌కు ఓటేస్తే జైలుకు.. జనసేనకు ఓటేస్తే అత్తారింటికే పోతారని ఎద్దేవా చేశారు. తనను నమ్ముకుంటే భవిష్యత్ బ్రహ్మాండంగా తీర్చే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఒక్కసారి గెలిపించాలని జగన్ ప్రజలను కోరుతున్నారని.. ఒక్కసారి అని తినే తిండిలో విషం కలుపుకొంటామా? ఒక్కసారి అని కొండ పైకెక్కి లోయలో దూకుతామా? అని ప్రశ్నించారు.