యూత్ కంటే నేనే బాగా ఆలోచిస్తా: చంద్రబాబు

వయసులో పెద్దవాడిని అయినా.. టీనేజర్స్ ఎలా ఆలోచిస్తారో అలానే ఆలోచిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోట్ల కోసం పనిచేయలే.. తెలుగు జాతి కోసం, తెలుగు వారి కోసం పనిచేశానని చెప్పారు. ఖమ్మంలో బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. ఐటీ చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని అందుకే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు.హైదరాబాద్ అభివృద్ది అయిందంటే తన వల్లేనని బాబు అన్నారు. హైదరాబాద్ డెవలప్ మెంట్ వెనుక ఉండే శ్రమను గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. హైటెక్స్ సిటీని 14 నెలల్లోనూ పూర్తి చేశామన్నారు. ఉద్యోగాలు, ఉపాధి వస్తుందని కంపెనీల చుట్టూ తిరిగానని చెప్పారు. ఎన్నోసార్లు తిరిగితే కాని బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ దొరకలేదన్నారు. హైదరాబాద్‭కు ప్రపంచ పటంలో గుర్తింపు రావాలని.. ఆ రోజు ఐఎస్బీ కోసం పాటుపడ్డానని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, అన్నింటికి ఒక ఎఫర్ట్ ఉందని చంద్రబాబు చెప్పారు. 

తాను కోరుకునేది అధికారం కాదని.. అభిమానం అని చంద్రబాబు అన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా.. వారి ఆత్మబంధువుగా ఉండాలని పనిచేస్తున్నానని చెప్పారు. నందమూరు తారకరామారావు వందేళ్ల జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామని బాబు అన్నారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు శక్తి అని..ఆయన ఒక వ్యవస్థ అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఉంటారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అధికారం కోసం పార్టీ పెట్టలేదని.. తెలుగు జాతి అవమానం పాలవుతుందని పెట్టారని అన్నారు. ఆయన.. సినిమాల్లో రారాజుగా ఉన్నారని చెప్పారు. తెలుగు వారి కోసం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. 

తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం ఆవిర్భవించిందని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ పెను మార్పులకు నాంది పలికిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్.. ఫుడ్ సెక్యూరిటీకి బీజం వేసి రూ.2లకే బియ్యం ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో పటేల్, పట్వారి వ్యవస్థను నిర్మూలించారని చంద్రబాబు అన్నారు. రూ.50లకే కరెంట్ ఇచ్చామన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీల కోసం గురుకుల పాఠశాలను తెచ్చారని అన్నారు. పేదలకు పక్కా ఇండ్లు కట్టించి.. చరిత్ర సృష్టించామన్నారు.