టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి తాను వెళ్లకుండా పోలీసులు నోటీసులు ఇవ్వడం ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ఏ చట్టం ప్రకారం తనకు నోటీసులు ఇచ్చారని.. తన రోడ్ షోను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. తనకు ఇచ్చిన నోటీసులపై పోలీసులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళుతున్న సమయంలో పెద్దూరులో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు రోడ్‌షో, సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కుప్పం పర్యటనకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నోటీసులు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మరోవైపు పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.