ఏపీకి ప్రత్యేక సాయం చేయండి.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ

ఏపీకి ప్రత్యేక సాయం చేయండి..  ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
  • కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రయార్టీ ఇవ్వండి 
  • ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌‌‌‌కు ముడి ఖనిజం స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా చేయాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రానికి ప్రయార్టీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎన్డీయే మిత్రపక్షాల భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా, నిధుల కేటాయింపులపై  కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, కుమారస్వామితో సమావేశమై చర్చించారు. సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో ఆయనతో అరగంట పాటు భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ఫ్లడ్ సెస్ విధించేందుకు అనుమ‌‌‌‌తి ఇవ్వాల‌‌‌‌ని కోరారు. అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్‌‌‌‌లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల రుణ మంజూరును వేగవంతం చేయాలని కోరారు. వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని మోదీని చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం. అంతకుముందు బీజేపీ చీఫ్ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీయే మీటింగ్ లో చంద్రబాబు పాల్గొన్నారు. జమిలి ఎన్నికలు, కొత్తగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు, ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మీటింగ్ లో చర్చించారు.

ప్రత్యేక ప్యాకేజీ కింద సాయం చేయండి.. 
ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని కూడా ఈ సందర్భంగా మోదీకి చంద్రబాబు వివరించారు. ఆ ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చేడాలని కోరారు. ఈ సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖల అనుమతులు త్వరితగతిన వచ్చేలా చూడాలని విన్నవించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పట్టాలు ఎక్కుతుందని, సహకరించాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఆర్థిక సాయం చేయాలని కోరారు. అనంతరం వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్ ను ప్రధానికి సీఎం అందజేశారు. వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రాజెక్టులపైనా చర్చించారు. అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతంపై చర్చించారు. విశాఖ రైల్వే జోన్ పనుల శంకుస్థాపన, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే అంశంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో చర్చించారు. 

మోదీ సానుకూలంగా స్పందించారు: రామ్మోహన్ నాయుడు  
చంద్రబాబు విజ్ఞప్తికి మోదీ, అమిత్ షా, నిర్మల, అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీకి చెందిన కీలకప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కేంద్ర సహకారంపై చర్చించామన్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో వాల్తేర్ రైల్వే డివిజన్ పురోగతి, రైల్వేజోన్ స్థాపన, ఏపీలో కనెక్టివిటీ, అభివృద్ధిని పెంచే లక్ష్యంతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వంటి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. సాంకేతిక రంగంలో డీప్‌‌‌‌టెక్, ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడానికి ఐటీ వ్యూహాలపైనా చర్చించామని ఆయన ట్వీట్ చేశారు.