ప్రతిదాడులు వద్దు.. సంయమనం పాటించండి: పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచన

ఎన్నికలు ముగిసిన ఏపీలో దాడులు మాత్రం ఆగడం లేదు. ఇరు పార్టీల కార్యకర్తలు ప్రతీకార దాడులకు దిగుతున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలపై మాటల దాడి చేసిన వారి ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని టీడీపీ శ్రేణులకు దాడులకు దిగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు, సలహాలు చేశారు.

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్‌గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలి. వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.." అని చంద్రబాబు ఎక్స్(ట్విట్టర్) ట్వీట్ చేశారు.

జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ 

అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గుండాలు దాడులకు దిగుతున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ  గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ ఏపీ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.." అని ట్వీట్ చేశారు. 

ఈ ప్రకటన అనంతరం అధినాయకత్వం.. వైయస్ఆర్సీపీ శ్రేణులకు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ కమిటీలు ఏర్పాటు చేసింది.