జగన్ తిన్నదంతా కక్కిస్తాం

టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ అవినీతిపై విచారణ చేయించి.. తిన్నవన్నీ తిరిగి కక్కిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు. గత మూడేళ్లలో జగన్ అవినీతి సంపాదన రూ.1.75 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఏడాదికి జగన్ లిక్కర్ ద్వారా రూ.5వేల కోట్లు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ మన్యం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ప్రతిరోజూ వందలాది లాటరైట్ లారీలు భారతీ సిమెంట్ కు వెళ్తున్నాయని పేర్కొన్నారు. అయినా భారతీ సిమెంట్ ధరనేం తగ్గించ లేదన్నారు. ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరడానికి కారకుడు జగనేనని.. ఆ డబ్బులన్నీ జగన్ జేబులోకే పోయాయని చంద్రబాబు చెప్పారు. రేపో, ఎల్లుండో ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక దారిలో పోయే ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

నీ పేపర్ కు కూడా నేను పర్మిషన్ ఇవ్వాలి

ఇంజనీర్ బ్రాండ్, డాక్టర్ బ్రాండ్, అడ్వకేట్ బ్రాండ్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యాన్ని అమ్మడంపై మండిపడ్డారు. ఒక్కో మద్యం క్వార్టర్ పై జగన్ కు రూ.12 ఆదాయం లభిస్తోందన్నారు. ఆ నాసిరకం  మద్యం తాగి చాలా చోట్ల జనం చనిపోయే పరిస్థితి కూడా వచ్చిందన్నారు. ‘‘ అవినాశ్ రెడ్డి ఎవరు ?  బాబాయిని చంపింది ఎవరు ? గొడ్డలి పోటును గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా ?’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘ దమ్ముంటే బాబాయిని హత్య చేసిన వాళ్లను జగన్  అరెస్టు చేయించాలి’’ అని సవాల్ విసిరారు. ‘‘ ఏపీని పాలిస్తున్నది బడుగు బలహీన వర్గాలు కాదు.. సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి’’ అని చంద్రబాబు తెలిపారు. ‘‘జగన్ ఒక ఐరన్ లెగ్. ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్. నాకు హైకమాండ్ ప్రజలే. ఎవ్వరికీ భయపడను. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత మనదే’’ అని చెప్పారు. ‘‘ జగన్మోహన్ రెడ్డి  గుడ్డి ప్రభుత్వం బాలకృష్ణ సినిమా ‘అఖండ’ను అడ్డుకునేందుకు యత్నించింది. అయితే ఏం జరిగిందో మీరు చూశారు. అది బాగా హిట్ అయింది. ఉన్మాది, దద్దమ్మ ముఖ్యమంత్రి .. సినిమాలకు కూడా పర్మిషన్ ఇస్తాడట. నీ పేపర్ కు కూడా నేను పర్మిషన్ ఇవ్వాలి అట్లయితే.. నీ టీవీ ఎట్లా నడుపుతావ్.. నీ భారతి సిమెంట్ ఎలా నడుపుతావ్ ’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘ఈ సభను చూసి జగన్ కు పిచ్చెక్కుతుంది. ఈ రోజు నిద్ర కూడా పట్టదు’’ అని కామెంట్ చేశారు. ఈ మహానాడుతో వైఎస్సార్ సీపీ అవినీతిపై యుద్ధం మొదలైందని చంద్రబాబు ప్రకటించారు. 

మన శరీరాన్ని కోసినా పసుపు రక్తమే వస్తుంది : లోకేశ్

‘‘జగన్ నువ్వు బస్సులు ఆపగలవు.. కార్లు ఆపగలవు. కానీ మా కార్యకర్తలను ఆపలేవు. ఆ పసుపు జెండాను చూస్తే ఎక్కడ లేని బలం వస్తుంది. మన శరీరాన్ని కోస్తే పసుపు రక్తం వస్తుంది. టీడీపీ తెలుగోడి పౌరుషం నుంచి మొదలైంది. శవాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి అయిన ఘనత జగన్ కే దక్కుతుంది. వైఎస్సార్ సీపీ అంటే..  యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు రాముడి లాంటి వ్యక్తి. రాముడు ఉన్నప్పుడు రాక్షసుడు కూడా ఉంటాడు.. ఆ రాక్షసుడే జగన్’’ అని టీడీపీ నేత నారా లోకేశ్ ఈ సభలో పేర్కొన్నారు. 

 

మరిన్ని వార్తలు.. 

టీడీపీ గెలిస్తేనే యువతకు భవిత

స్వతంత్య్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్