రోశయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

హైదరాబాద్:  ఏ పదవిలో ఉన్నా రాణించిన గొప్ప వ్యక్తి మాజీ సీఎం రోశయ్య అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో రోశయ్య కీలకపాత్ర పోషించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. తన పార్టీ ముఖ్య నాయకులతో కలసి రోశయ్య భౌతికకాయంపై చంద్రబాబు నాయుడు పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.
 ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో  మాట్లాడుతూ రోశయ్య ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. 1975 నుంచి రోశయ్యతో పరిచయం, అనుబంధం ఉందని, కేవలం రాజకీయంగానే రోశయ్యతో విభేదించాము తప్ప ఆయనతో మంచి సంబంధాలే ఉండేవన్నారు.

రోశయ్య ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ వంటి వారని, ఏ విషయంలోనైనా ఆయన తీసుకుంటే దాన్ని  సమర్థవంతంగా నిర్వహించారని, ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఒకేలా పనిచేస్తారని కొనియాడారు. ఒక్కోసారి కలసి పనిచేశామని, ప్రజలను చైతన్యం చేయడం కోసం ఇద్దరం అనేక నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు వివరించారు.  అందరి మన్ననలు అందుకునేవారని, అసెంబ్లీలో 15సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి పదవులకే వన్నె తెచ్చిన ఘనత రోశయ్యకే చెందుతుందని అన్నారు. ఆయన స్ఫూర్తి తెలుగు జాతి ఎప్పటికి మరవదని, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు బతికే ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు.