ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపేస్తామంటూ చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మళ్లీ ఏపీని కలిపే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ గా ఉన్నానని బాబు అన్నారు. 40 ఏళ్లు ఏ ప్రజలైతే తనను ఆశీర్వదించారో వారి కోసం జీవితాంతం పనిచేస్తానని చెప్పారు. టీడీపీ వేసిన ఫౌండేషన్ వల్ల పెద్ద రాష్ట్రాలను కలుపుకుని... తెలంగాణ ఎక్కువ ఆదాయాన్ని రాబడుతోందని బాబు అన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసి.. రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న ఆశ ఉందన్నారు. అలాగే... ఏపీలో గాడి తప్పిన పాలనను ఆదుకోవాలని చంద్రబాబు చెప్పారు. తెలుగురాష్ట్రాలు విడిపోయినా.. కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శం అవుతాయని ఆయన స్పష్టం చేశారు.
యంగ్ స్టర్స్ ఉండే దేశం ఇండియా అని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఆయన చెప్పారు. ఏపీ రెండు రాష్ట్రాలుగా మారినా.. తాను వేసిన ఫౌండేషన్నే తెలంగాణలో కొనసాగించారని బాబు అన్నారు. కానీ ఏపీలో విధ్వంసం సృష్టించారని విమర్శించారు. 20 ఏళ్ల క్రితం భద్రాచలం వర్షాల వల్ల మునిగిపోయిందని.. దానిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ హయాంలో కరకట్టను నిర్మించామన్నారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడా అనే వాళ్లకు ఖమ్మం సభే సమాధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందని ఆయన అన్నారు. టీడీపీలో ఇన్ యాక్టివ్ ఉంటే యాక్టివ్ అవ్వండి అంటూ.. ఖమ్మం సభ ద్వారా తెలంగాణకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. తాము సైతం పోరాటానికి సిద్ధం అని యువకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నుంచి చాలామంది వెళిపోయారని.. ఎవరూ లేకపోయినా ప్రజా బలమే తనకు నిదర్శనమన్నారు. నాయకులను తయారు చేసేది టీడీపీ అని చంద్రబాబు అన్నారు. పార్టీ అవసరమనుకున్న వాళ్లు పార్టీలోకి రావాలని..మళ్లీ తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలని చంద్రాబాబు కోరారు.