చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ13కు వాయిదా

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ13కు  వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం  ( అక్టోబర్ 13 ) మధ్యాహ్నానికి  వాయిదా వేసింది. చంద్రబాబు తరపున ఇవాళ ( అక్టోబర్ 10 ) సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17ఏ చంద్రబాబుకు కచ్చితంగా వర్తిస్తుందని చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని కోర్టుకు సాల్వే వివరించారు. 2021 సెప్టెంబర్ 17న ఫిర్యాదు దాఖలైందని సాల్వే తెలిపారు. అయితే విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. 17(A)అనేది అవినీతి నిరోధానికి ఉండాలని.. కానీ కాపాడేందుకు కాదని బేలా త్రివేది పేర్కొన్నారు. ఇదే కధా 17-ఏ చట్టం అసలు ఉద్దేశమన్నారు. 17ఏలో చాలా అంశాలున్నాయని తెలిపారు. 17ఏకు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా అని ప్రశ్నించారు. 17ఏ ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. మరోవైపు సీఐడీ తరఫున ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించారు.

 17 ఏ చట్ట సవరణ అనేది నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ  వాదించారు.. 2018 కి ముందు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ కొంతవరకు సాగి నిలిచిపోయిందన్నారు. అంతమాత్రాన విచారణ జరగలేదని చెప్పడం సరైంది కాదని ఆయన వాదించారు.2018లోనే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  మెమో దాఖలు చేసిన విషయాన్ని రోహత్గీ గుర్తు చేశారు.  మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లను బెంచ్ ముందుంచుతున్నామని చెప్పారు.విచారణ ముగిశాక కాగితాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.  2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్ లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడవద్దని రోహత్గీ కోరారు.చంద్రబాబుపై తగిన ఆధారాలు దొరికన తర్వాతే 2021లోనే కేసు నమోదు చేశారని రోహత్గీ వాదించారు.17ఏ అన్నది నేరం కేంద్రంగా జరుగుతుందా, వ్యక్తి కేంద్రంగా జరుగుతుందా అని  జస్టిస్ త్రివేది ప్రశ్నించారు.అవినీతి నిరోధక చట్టం అమలు కానప్పుడు మిగిలినవన్నీ  పరిగిణనలోకి తీసుకోవద్దని పిటిషన్లర్ల తరపు న్యాయవాదులు చెబుతున్నారని జస్టిస్ త్రివేది రోహత్గీ దృష్టికి తెచ్చారు. రెండు వర్గాలు వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేసు విచారణను శుక్రవారం  ( అక్టోబర్ 13 ) మధ్యాహ్నానికి  వాయిదా వేసింది. 

ALSO READ : హైదరాబాద్లో 1,587 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: సీవీ ఆనంద్