టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. స్కిల్ డెలవప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలదృష్ణా వైద్య చికిత్స నిమిత్తం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 52 రోజులు జైలులో ఉన్న చంద్రబాబు మంగళవారం ( అక్టోబర్ 31) సాయంత్రం విడుదలయ్యారు.
స్కిల్ కేసులో చంద్రబాబు సెప్టెంబరు 9న నంద్యాలలో అరెస్ట్ అయ్యారు. ఆ మరుసటి రోజున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు..4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు వైద్య చికిత్స కోసమే ఈ బెయిల్ ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఆస్పత్రికి వెళ్లడం తప్ప ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు..ఫోన్‌లో కూడా మాట్లాడవద్దని షరతులు పెట్టింది. మీడియాతో మాట్లాడవద్దని..రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. అనంతరం నవంబరు 28 సాయంత్రం 5 లోగా మళ్లీ సరెండర్ కావాలని తెలిపింది . జైలు నుంచి విడుదలయిన తర్వాత చంద్రబాబుకు ఎక్కడికైనా వెళ్లి వైద్య చికిత్స చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నవంబరు 10న విచారిస్తామని ఏపీ హైకోర్టు పేర్కొంది.