మద్యం కేసులో చంద్రబాబుకు రిలీఫ్: ఆ కేసులో చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు

మద్యం కేసులో చంద్రబాబుకు  రిలీఫ్: ఆ కేసులో చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు

స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరైన చంద్రబాబుకు మద్యం కేసులో రిలీఫ్ లభించింది.  ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ కేసును హైకోర్టు విచారించింది.

 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  హయాంలో మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని  సీఐడీ కేసు నమోదు చేసింది.ఈ కేసులో చంద్రబాబును ఏ3గా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో మంగళవారం ( అక్టోబర్ 31)  చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మద్యం కేసులో చంద్రబాబు లంచ్‍మోషన్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఇతర ఏ కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోమని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మద్యం కేసులో 15న కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏజీ వెల్లడించారు. తదుపరి విచారణను నవంబర్ 21కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.


మద్యం కేసు వివరాలివే

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వ్యవహరించిన సమయంలో మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కొన్ని డిస్టిలరీలకు చంద్రబాబు అనుకూలంగా వ్యవహరిస్తూ అనుమతులు మంజూరు చేశారని సీఐడీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి నిబంధనలు సైతం ఉల్లఘించినట్లు తెలిపారు. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగంగా జరిగిందని సీఐడీ అభియోగం మోపింది. రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టిలరీలకు లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ వెల్లడించింది. ఇందులో ఏ1గా ఐఎస్ నరేశ్, ఏ2గా కొల్లు రవీంద్ర ఉన్నారు. ఐపీసీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం 166, 1678, 409, 120(బి) రెడ్ విత్ 34 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్ల ప్రకారం చంద్రబాబు, కొల్లు రవీంద్ర, నరేశ్‌‌పై సీఐడీ కేసులు నమోదు చేసింది. సీఐడీ ఆరోపించిన కేసులో ఐఎస్ నరేశ్ నాటి ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా వ్యవహరించారు. అంతేకాదు కొల్లు రవీంద్ర నాటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇకపోతే ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.