ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నామని.. ఇకపై ఎవరైనా భూమిని దురాక్రమిస్తే బయట తిరగలేరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భూమిని ఆక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష పడటంతో పాటు భూమి కూడా పోతుందని చెప్పారు. భూ ఆక్రమణల కేసులను డీఎస్పీ లేదా ఇంకా పై స్థాయి అధికారి విచారిస్తారని.. భూమిని ఆక్రమించిన వాళ్లకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం (నవంబర్ 21) శాసన సభలో సీఎం చంద్రబాబు ప్రసగించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ అక్రమణలకు పాల్పడ్డారని.. రైతులకు నోటీసు కూడా ఇవ్వకుండా రెవెన్యూ రికార్డులు మార్చారని.. ఏదైనా సమస్య ఉంటే హైకోర్టుకు వెళ్లమని చెప్పారు. హైకోర్టుకు వెళ్లడం రైతుకు సాధ్యమేనా అని వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆ చట్టాలను కాల్చేసి అప్పట్లో నిరసన తెలిపామని గుర్తు చేశారు. అందుకే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని తెలిపారు. ఆ చట్టాన్ని రద్దు చేశాం కానీ.. అందులో జరిగిన అవకతవకలను ఏం చేయాలేకపోతున్నామన్నారు.
ఇక, ఆడబిడ్డల జోలికొస్తే గుండెల్లో రైలు పరిగెత్తిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని.. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరి ఫొటో మార్ఫింగ్ చేసి పెడతారో తెలియని పరిస్థితి దాపరించిందని.. నోటీతో పలకడానికి కూడా వీలు లేని విధంగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ | వైసీపీకి మరో షాక్: జనసేనకే పీఏసీ చైర్మెన్ పదవి..
వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ పేరుతో వేరేవాళ్లు పోస్టులు పెట్టారని మాజీ సీఎం జగన్ అంటున్నారు.. తన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టినవాళ్లను కూడా జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లిపై అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టిన వారిని ఆయన సమర్థిస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా కార్పొరేషన్ పేరుతో డబ్బులిచ్చి పేటీఎం బ్యాచ్‌ను పెట్టుకుని పోస్టులు పెట్టించారని ఆరోపించారు. ఆడబిడ్డల జోలికి వచ్చే వాళ్లను, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.