జగన్ అరాచక పాలన .. త్వరలోనే అంతమైతది : కాసాని

జగన్ అరాచక పాలన .. త్వరలోనే అంతమైతది : కాసాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి.. జైల్లో పెట్టి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఫైర్​అయ్యారు. కక్షసాధింపు రాజకీయాలతో టీడీపీ శ్రేణులపై దాడులకు దిగుతూ.. ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్ పై ప్రజలు తిరుగుబాటు చేసి ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. 

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం కాసాని ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు మౌన ర్యాలీ చేట్టారు. బాబును  వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద 'నేను సైతం బాబు వెంటే' అనే నినాదంతో రాసిన ఉన్న ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ..  చంద్రబాబు అరెస్టు తీరుపై యావత్ ప్రపంచం ఏపీ ప్రభుత్వ చర్యలను తప్పుబడుతోందని విమర్శించారు. మూడు దఫాలు సీఎంగా పనిచేసి, లక్షల కోట్లు ఖర్చు చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు లాంటి విజనరీ లీడర్.. కేవలం రూ.371 కోట్ల స్కామ్​ చేశారని జైల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. జగన్ సర్కారు దౌర్జన్య పాలనను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారని చెప్పారు. 

జగన్ ప్రభుత్వ కుట్రలు ఫలించవని, అక్రమ కేసుల నుంచి చంద్రబాబు త్వరలోనే నిర్దోషిగా జైలు నుంచి బయటకు వస్తారని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనకు మద్దతుగా ఉంటారని కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. పార్టీ  పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ముందస్తు నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం, అనాగరిక చర్యని మండిపడ్డారు.