జహీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పార్టీ జాతీయ నాయకులు, బీహార్ సీఎల్పీ నాయకుడు షకీలా అహ్మద్ ఖాన్, పీసీసీ కార్యదర్శి ఉజ్మ షకీర్, మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని చెప్పారు.
ప్రతి హామీని నిలబెట్టుకుంటాం
రేగోడ్ : తుక్కుగూడ విజయభేరి సభలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా రేగోడ్ మండల పరిధిలోని గజవాడ గ్రామంలో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు కొప్పుల రాజుతో కలిసి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు.
ప్రజలకు భరోసా కల్పించేది కాంగ్రెస్..
కంది : కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు భరోసా ఉంటుందని పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు గురుదీప్ సింగ్ సప్పల్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో కలిసి ఆయన క్యాంప్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. అంతకుముందు సంగారెడ్డి టౌన్ లోని పలు వార్డుల్లో ఇంటింటికీ గ్యారంటీ కార్డులు పంపిణీ చేశారు.
మాట తప్పని పార్టీ మాది
హుస్నాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమ మొదటి సంతకాన్ని ఆరు గ్యారెంటీల అమలు చేసే ఫైలుమీదనే పెడతామని, మాట తప్పని పార్టీ తమదని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్ మోహన్ ప్రకాశ్ అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇంటింటికీ వెళ్లి ఆరు గ్యారెంటీల అమలు చేసే హామీ కార్డుపై సంతకం చేసి ప్రజలకు ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీలను ఫస్ట్ క్యాబినెట్ భేటీలోనే సంతకం చేసి అమలు చేస్తామని చెప్పారు. టికెట్ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.