- చంద్రయాన్ 2 ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్ మార్పు సక్సెస్
- ఆగస్టు 20 నాటికి పూర్తిగా జాబిల్లి కక్ష్యలోకి
- అప్పటి నుంచి మరో నాలుగు సార్లు కక్ష్యలో మార్పులు
చంద్రయాన్2 చందమామ లైన్లోకి వెళ్లిపోయింది. భూ కక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 2.21 గంటలకు చంద్రయాన్2ను ఇస్రో భూ కక్ష్య దాటించింది. 1203 క్షణాల పాటు స్పేస్‌క్రాఫ్ట్ ద్రవ ఇంజన్‌ను మండించి లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ (చంద్రుడి కక్ష్యలోకి మార్చడం) ప్రయోగాన్ని చేసింది. అంతకుముందు జులై 23 నుంచి ఆగస్టు 6 వరకు ఐదు సార్లు చంద్రయాన్ 2 కక్ష్యలో మార్పులు చేసింది ఇస్రో. స్పేస్‌క్రాఫ్ట్ పనితీరును బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్‌వర్క్‌లోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ పరిశీలిస్తోంది. అందుకు బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) సహకారం తీసుకుంటోంది. ప్రస్తుతం చంద్రయాన్2 ఎలాంటి లోపం లేకుండా పనిచేస్తోంది. ఆగస్టు 20 నాటికి స్పేస్‌క్రాఫ్ట్ జాబిల్లికి దగ్గరగా వెళుతుంది. అప్పుడు మరోసారి ద్రవ ఇంజన్‌ను మండించి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్2ను పంపుతారు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్యను మారుస్తారు. ఆ తర్వాతి షెడ్యూల్‌నూ ఇస్రో ప్రకటించింది. ఎప్పుడెప్పుడు కక్ష్య మార్పులు చేస్తుందో ప్రకటించింది.
అపోలో 11 నాలుగు రోజుల్లోనే
చంద్రయాన్ 2 చందమామ మీద దిగడానికి 48 రోజుల టైం తీసుకుంటోంది. అమెరికా 1969లోనే నాసా చేపట్టిన అపోలో 11 ప్రయోగం ద్వారా నాలుగు రోజుల్లోనే చందమామ దగ్గరకు వెళ్లిపోయారు. వెళ్లిపోవడం కాదు, తొలిసారిగా జాబిల్లిపై అడుగుపెట్టారు. 1959లో రష్యా చేసిన లూనా 2 ప్రయోగం కూడా రోజున్నరలోనే చంద్రుడి దగ్గరకు వెళ్లింది. ప్రయోగానికి జస్ట్ కొన్ని రోజులే పట్టింది. మరి ఆ దేశాలకు అంత తక్కువ టైం ఎందుకు పట్టింది, మనకెందుకు అంత లేట్ అవుతోందన్న డౌట్ వచ్చిందా? దానికి సమాధానం రాకెట్లలోనే ఉంది. ఆ రాకెట్ల ఇంధన సామర్థ్యం, లూనార్ స్పేస్‌క్రాఫ్ట్ వేగంపై ఆధారపడి ఉంటుంది. సుదూర విశ్వంలోకి వెళ్లేటప్పుడు రాకెట్ స్పీడ్, సరాసరి మార్గం చాలా అవసరం. కాబట్టి అపోలో 11 మిషన్‌కు నాసా శక్తిమంతమైన శాటర్న్ 5 రాకెట్‌ను వాడింది. లూనార్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, కమాండ్ మాడ్యూల్(ఆస్ట్రోనాట్లు ఉండే క్రూ క్యాప్సూల్) సహా 43 టన్నుల బరువును ఆ రాకెట్ మోసుకెళ్లగలుగుతుంది. అంతేకాదు, గంటకు 39 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. కేవలం మూడో దశలోనే అపోలో 11ను ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్ (చంద్రుడి కక్ష్య మార్పిడి)లోకి పంపించింది శాటర్న్ 5. మొత్తంగా నాలుగు రోజుల ఆరు గంటల 45 నిమిషాల్లోనే చంద్రుడి దగ్గరకు వెళ్లిపోయింది క్రూ. అందుకు లాంచర్, లూనార్ క్రాఫ్ట్‌లకు శక్తిమంతమైన ఇంజన్లను వాడారు. అయితే, అందుకు నాసా బాగానే డబ్బు ఖర్చు చేసింది. అప్పట్లోనే 18.5 కోట్ల డాలర్లను నాసా ఖర్చు పెట్టింది. అందులో 11 కోట్ల డాలర్లను కేవలం రాకెట్ కోసమే ఖర్చు చేసింది. ఇప్పటి మన కరెన్సీ ప్రకారం దాని విలువ 785 కోట్ల రూపాయలు (అప్పట్లో అమెరికా డాలర్‌తో మన రూపాయి విలువ చాలా తక్కువ. కాబట్టి విలువ తగ్గుతుంది). అయితే, మొత్తం ప్రయోగానికి ఇప్పటి ఖర్చుల ప్రకారం లెక్కిస్తే 120 కోట్ల డాలర్లు ఖర్చవుతుంది. అంటే ₹8564 కోట్లు. శాటర్న్ 5 ఎలాంటి స్లింగ్ షాట్లు లేకుండా సరాసరి మార్గంలో వెళ్లింది కాబట్టి ప్రయోగానికి టైం తక్కువ తీసుకుంది. ఎక్కువ ఖర్చైంది.
మనది స్లింగ్ షాట్ రూట్
జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్. మనం బాహుబలిగా దానికి ముద్దు పేరు పెట్టుకున్నాం. కానీ, శాటర్న్5 రాకెట్‌తో పోలిస్తే మన బాహుబలి రాకెట్ చాలా చాలా చిన్నదే. శాటర్న్ 5, 43 టన్నుల బరువును మోసుకెళితే, జీఎస్ఎల్వీ కేవలం 4 టన్నులకు పరిమితం. అందులో వాడే ఇంధనం కెపాసిటీ కూడా చాలా తక్కువ. స్పేస్‌క్రాఫ్ట్ ఇంజన్ శక్తీ చాలా తక్కువ. అందుకే సరాసరి మార్గంలో కాకుండా స్లింగ్ షాట్ రూట్‌ను ఇస్రో ఎంచుకుంది. అంటే కొద్ది రోజుల పాటు స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమి కక్ష్యలోనే తిప్పుతారు. అలా కొన్ని రోజుల పాటు వేగంగా తిప్పి తిప్పి చాలా ఎత్తుకు, దూరానికి తీసుకెళతారు. ఆ వేగంతోనే చంద్రుడి కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ను దాని ఇంజన్ల ద్వారా నెట్టేస్తారు. మళ్లీ ఇక్కడ కొన్ని రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో స్పేస్‌క్రాఫ్ట్‌ను తిప్పుతారు. భూ కక్ష్య నుంచి మార్చడానికి ఏం చేశారో ఇక్కడా అదే చేసి చంద్రుడికి దగ్గరగా తీసుకెళతారు. ఆ తర్వాత చంద్రుడి మీదకు దింపుతారు. ఈ స్లింగ్ షాట్ చేయాలంటే స్పేస్‌క్రాఫ్ట్‌కు వేగం, తిరిగే గతి ముఖ్యం కాబట్టి అన్ని రోజులు పడుతుంది. మొత్తంగా ప్రయోగానికి ఎక్కువ రోజులు తీసుకుంటుంది. ఈ పద్ధతి వల్ల ఇంధనం తక్కువ ఖర్చు అవడంతో పాటు, ప్రయోగ ఖర్చూ తగ్గుతుంది. అందుకే చంద్రుడి ప్రయోగానికి నాసా వేల కోట్లు ఖర్చు పెడితే, ఇస్రో మాత్రం కేవలం 970 కోట్లతో పూర్తి చేసేస్తోంది. అందులో 375 కోట్ల రూపాయలను బాహుబలి రాకెట్ తయారీకి ఖర్చు పెట్టింది.
కక్ష్య తేదీ టైం కక్ష్య ఎత్తు/కక్ష్య దూరం
ఎల్‌బీఎన్1 ఆగస్టు 20 8.30 – 9.30 118 / 18,078
ఎల్‌బీఎన్2 ఆగస్టు 21 12.30 – 1.30 121 / 4303
ఎల్‌బీఎన్3 ఆగస్టు 28 5.30 – 6.30 178 / 1411
ఎల్‌బీఎన్4 ఆగస్టు 30 సాయంత్రం 6-7 126 / 164
ఎల్‌బీఎన్5 సెప్టెంబర్ 1 సాయంత్రం 6-7 114 / 128
ఎల్‌బీఎన్ అంటే చంద్రుడి కక్ష్య. సెప్టెంబర్ 2న చంద్రయాన్2 స్పేస్‌క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరవుతుంది. సెప్టెంబర్ 7న చంద్రుడి మీదకు ల్యాండర్‌ను దింపే ముందు మరో రెండు సార్లు కక్ష్యలో మార్పులు చేస్తారు.