విక్రమ్ ల్యాండింగ్ సైట్‌ను రెండోసారి ఫొటోలు తీసిన నాసా మూన్ ఆర్బిటర్
చంద్రయాన్ 2 ల్యాండర్ విక్రమ్ జాడ దొరకలేదు. నాసా ఆర్బిటర్ రెండోసారి తీసిన ఫొటోల్లోనూ అది కనిపించలేదు. బుధవారం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 7న చందమామపై దిగుతుండగా విక్రమ్ ల్యాండర్ అదుపుతప్పి పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇస్రో కొద్ది రోజుల వరకూ విక్రమ్ జాడను తెలుసుకునే ప్రయత్నం చేసింది. మళ్లీ దానిని లైన్లోకి తీసుకురావడానికి ట్రై చేసింది. కానీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. సెప్టెంబర్ 17న తొలిసారిగా అమెరికా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్.. విక్రమ్ ల్యాండ్ అయిన ఫొటోలను తీసిన సంగతి తెలిసిందే. దాంట్లో విక్రమ్ ఆనవాళ్లు కనిపించలేదు. తాజాగా అక్టోబర్ 14న మరోసారి ఎల్ఆర్వో ఫొటోలు తీసింది. ఆ ఫొటోల్లోనూ విక్రమ్ కనిపించలేదు. ‘‘విక్రమ్ దిగిన ప్రాంతాన్ని ఎల్ఆర్వో ఫొటోలు తీసింది. కానీ, దాని ఆనవాళ్లేవీ అక్కడ కనిపించలేదు. కెమెరా టీం చేంజ్ డిటెక్షన్ టెక్నిక్‌ను ఉపయోగించి ఆ ఫొటోలను చాలా క్షుణ్ణంగా పరిశీలించింది” అని ఎల్ఆర్వో మిషన్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ నోవా ఎడ్వర్డ్ పెట్రో తెలిపారు. చందమామపై ఉల్కల ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఈ టెక్నిక్‌నే వాడామని, ఈ టెక్నిక్‌తోనే ఇజ్రాయెల్ మూన్ ల్యాండర్ బియర్షీట్ను గుర్తించామని చెప్పారు. విక్రమ్ చీకట్లో అయినా ఉండి ఉంటుందని, లేకపోతే ఇప్పుడు వెతుకుతున్న ప్రదేశానికి దూరంగానైనా పడిపోయి ఉంటుందని ఎల్ఆర్వో మిషన్ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ అన్నారు.