న్యూఢిల్లీ: చంద్రయాన్‑–3 మిషన్ ను ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం ప్రకటించింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి జులై 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్ 3(ఎల్వీఎం3) రాకెట్ ద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్ ను రాకెట్ లో అనుసంధానించి, ఇప్పటికే శాటిలైట్ సెంటర్ నుండి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్‌కు చేర్చామని తెలిపారు. ప్రస్తుతం ఎల్వీఎం3 రాకెట్ ను సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయన్నారు. అయితే, 14వ తేదీన అనుకోని అవాంతరాలు ఎదురైతే.. 19వ తేదీ వరకూ ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ సారి చంద్రుడిపై మన స్పేస్ క్రాఫ్ట్ సాఫీగా ల్యాండ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రయాన్–2 ప్రయోగం సందర్భంగా ల్యాండర్ చంద్రుడిపై క్రాష్ అయినప్పుడు ఎదురైన సమస్యలు రిపీట్ కాకుండా చూసుకుంటున్నామని ఆయన చెప్పారు. చంద్రయాన్–3 ల్యాండర్లో చాలా మార్పులు చేసినట్లు తెలిపారు. ఇంజిన్, సెన్సర్, థ్రస్ట్ వైఫల్యాలను గుర్తించి చక్కదిద్దేందుకు అత్యాధునిక సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ల్యాండర్ సూర్యరశ్మి సోకని ప్రాంతంలో ల్యాండ్ అయినా పవర్ పొందేందుకు వీలుగా మరిన్ని సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.