భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 చంద్రునికి మరింత చేరువైంది. బుధవారం(ఆగస్టు 16న) ఇస్రో ఉద్దేశించినట్లుగానే ఈ వ్యోమనౌక చివరి కక్ష్య తగ్గింపు (ఐదో కక్ష్య) విన్యాసాన్ని ఇస్రో పూర్తి చేసింది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ ఈ ఉపగ్రహం 153KmX 163Km కక్ష్యలో కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. దీంతో చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం చేరడంలో దాదాపు లక్ష్యానికి అత్యంత సమీపంలో ఉంది.
ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రోపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ ను వేరు చేయడానికి ఆగస్టు 17, 2023న ప్లాన్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఆగష్టు 16 తర్వాత ల్యాండర్ నెమ్మదిస్తుందని, ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. అయితే ల్యాండింగ్‌లో కీలకమైన భాగం ల్యాండర్ వేగాన్ని 30 కి.మీ ఎత్తు నుంచి తుది ల్యాండింగ్‌కు తీసుకురావడం, అంతరిక్ష నౌకను అడ్డం నుంచి నిలువు దిశకు బదిలీ చేయడం కీలక విన్యాసం అని ఇస్రో తెలిపింది.