ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్ 3 మిషన్ విక్రమ్ ల్యాండింగ్ పైనే.. మరికొన్ని గంటల్లో జరగబోయే అద్భుతం గురించే ఇప్పుడు చర్చ. మరో 72 గంటల్లో భారత్ చారిత్రక విజయం అందుకోబోతోంది.
చంద్రునిపై ల్యాండ్ అయ్యేందుకు చంద్రయాన్ 3 దాదాపు అన్ని కీలక ప్రక్రియలు పూర్తి చేసింది. ఇక మిగిలింది చివరి ఘట్టం.. భారత్ సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే మేటి దేశంగా నిలపే చారిత్రక ఘట్టం విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగే..
నిన్న (శనివారం చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ రెండవ,చివరి డీబూస్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. లాండర్ మాడ్యూల్ కక్ష్యను 25 కిమీ x 134 కిమీకి విజయవంతంగా తగ్గించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం ప్రకటించింది. ఇదే చంద్ర కక్ష్యలో విక్రమ్ ల్యాండర్ చివరి ప్రయాణం. తదుపరి స్టాప్ చంద్రుని దక్షిణ ధృవమే..
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో సిద్ధంగా ఉంది. చంద్రునిపై పరిశోధన కోసం ప్రతిష్టాత్మకంగా ఇస్రో చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న సాయంత్రం 5.45 కి సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది.