చంద్రుడిపై అన్వేషణకు ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయాణంలో మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమవుతోంది. 2027లో చంద్రయాన్ -4 మిషన్‌ను ప్రయోగించనున్నట్లు కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్రుని శిలల నమూనాలను భూమికి తిరిగి తీసుకురావడమే దీని లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ మిషన్‌లో ఐదు భాగాలను రెండు భారీ-లిఫ్ట్ LVM-3 రాకెట్ల ద్వారా ప్రయోగించి.. కక్ష్యలోకి వెళ్లాక అసెంబుల్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీన్ని బట్టి ఇటీవల పరీక్షించిన SPADEX మిషన్ అందుకోసమే అని స్పష్టమవుతోంది.
"చంద్రయాన్-4 మిషన్ చంద్రుని ఉపరితలం నుండి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది.." కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రివర్గం చంద్రయాన్ -4 మిషన్‌ను ఆమోదించింది. ఈ మిషన్ కోసం ప్రభుత్వం రూ.2104.06 కోట్లు కేటాయించింది.
గగన్‌యాన్ మిషన్
భారత వ్యోమగాములను భూమి దిగువ కక్ష్యలోకి పంపే గగన్‌యాన్ మిషన్(Gaganyaan Mission) వచ్చే ఏడాది ప్రారంభించబడుతుందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యం వ్యోమగాముల బృందాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం, అక్కడ వారు భూమి నుండి 400 కి.మీ ఎత్తులో భూమి దిగువ కక్ష్యలో (LEO) మూడు రోజుల పాటు ప్రయాణించి.. తిరిగి హిందూ మహాసముద్రంలో ల్యాండ్ అవుతారు.
2026లో సముద్రయాన్..
2026లో ఇస్రో సముద్రయాన్ మిషన్ ను ప్రయోగించనుంది. ఈ మిషన్ లో ముగ్గురు శాస్త్రవేత్తలలు సముద్రంలో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లి సముద్రగర్భాన్ని అన్వేషించనున్నారు. కీలకమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర జీవవైవిధ్యం వంటి సమాచారాన్ని సేకరించనున్నారు.