- పేదల విద్యాభివృద్ధికి నేను చేస్తున్న కృషికి అడ్డుపడొద్దు: అక్బరుద్దీన్ ఒవైసీ
- నా బిల్డింగులను కుట్రపూరితంగా కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: పేదల విద్యాభివృద్ధికి తాను చేస్తున్న కృషికి అడ్డుపడొద్దంటూ చాంద్రాయణగుట్ట మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టు పీజీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పేదలకు ఉచిత విద్య అందించేందుకు ఇప్పటి వరకు నేను 12 బిల్డింగ్స్ నిర్మించాను. కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వాటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నాపై దాడి జరిగింది. కావాలనుకుంటే మళ్లీ ఇప్పుడు తుపాకులతో నన్ను కాల్చండి. బుల్లెట్ల వర్షం కురిపించండి.. కత్తులు, తల్వార్లతో దాడి చేయండి. కానీ, పేదల విద్యాభివృద్ధికి నేను చేస్తున్న కృషికి అడ్డుపడొద్దు.
నన్ను బలహీనుడిగా భావించొద్దు. శత్రువులను ఓడించే శక్తి నాకు ఉంది. ఇలాంటి ఎత్తయిన బిల్డింగ్‌లను మరిన్ని నిర్మిస్తా. విద్యావ్యాప్తికి నేను అంకితభావంతో చేస్తున్న కృషికి అడ్డుపడకండి’’అంటూ అక్బరుద్దీన్ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సాలార్- ఏ -మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. 400 మంది మహిళలు, యువతులకు కుట్లు, మెహందీ, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లిగ్ వయోజన విద్య తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.