వరంగల్ సిటీ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ సిటీలో పార్టీ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీవైపే చూస్తున్నారని తెలిపారు. పార్టీ సీనియర్ లీడర్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రేవూరు ప్రకాశ్‌రెడ్డి, కుసుమ సతీశ్, విజయ చందర్ రెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డి, జలగం రంజిత్, అనిత తదితరులున్నారు.
నిరంకుశ పాలనను అంతం చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: కేసీఆర్ నిరంకుశ పాలనను అంతం చేయాలని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో జిల్లా కార్యవర్గ మీటింగ్ నిర్వహించారు. కేసీఆర్ మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ.. తీరని అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. ఇప్పటివరకు జాబ్‌క్యాలెండర్‌ను విడుదల చేయకపోవడంతో సిగ్గుచేటన్నారు. పార్టీ జిల్లా ఇన్చార్జి పాపారావు, రాష్ట్ర నాయకులు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, బొజ్జపల్లి సుభాశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉడుగుల రమేశ్, జిల్లా కార్యదర్శులు శివరాజ్, పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, మండలాధ్యక్షుడు గట్టు క్రిష్ణ తదితరులున్నారు.
ఈ ఏడాదిలోపే డబుల్ ఇండ్లు పంచాలి
హనుమకొండ, వెలుగు: పేదల గుడిసెల్ని ఖాళీ చేయించి, ఆ స్థలంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను సైతం ప్రభుత్వం పంచడం లేదని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మండిపడ్డారు.ఈ ఏడాదిలోగా పేదలకు ఇండ్లు ఇవ్వకుంటే తామే ఆ ఇండ్లన్నీ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం బాలసముద్రంలోని అంబేడ్కర్ నగర్ లో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను స్థానిక బీజేపీ లీడర్లతో కలిసి పరిశీలించారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన అమలు చేస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ కాలనీలో గతంలో మంత్రి కేటీఆర్ ఇండ్లు కేటాయిస్తూ అలాట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారని, స్థానిక లీడర్లు కమీషన్లు దండుకునేందుకే ఇండ్ల పంపిణీ ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చడం కంటే ఆడంబరాలు, ప్రచారాలపైనే కేసీఆర్ ప్రభుత్వం దృష్టి పెడుతోందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల కోమల కిషన్, గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు దేశిని సదానందం గౌడ్, పాశికంటి రాజేంద్ర ప్రసాద్, డి.అమర్నాథ్ రెడ్డి, బైరి శ్రావణ్, తోపుచెర్ల అర్చన మధుసూధన్ రావు తదితరులున్నారు.
స్టూడెంట్లు సైంటిస్టులు కావాలి
తొర్రూరు, వెలుగు: స్టూడెంట్లు సైంటిస్టులుగా మారి సమాజాభివృద్ధికి కృషి చేయాలని నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం తొర్రూరులో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిస్ట్రిక్ లెవెల్ ‘చెకుముకి’ సైన్స్ సంబరాలు నిర్వహించారు. చీఫ్ గెస్టుగా లక్ష్మారెడ్డి హాజరై ప్రోగ్రాంను ప్రారంభించారు. చెకుముకి పోటీల వల్ల స్టూడెంట్లకు ఆలోచనా శక్తి, శాస్త్రీయ దృక్పథం అలవడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సైన్స్ ను ఒక శక్తిగా ఆదరించాలన్నారు. కార్యక్రమలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు తడకమల్ల బ్రహ్మం, డిస్ట్రిక్ట్ క్వాలిటీ కోఆర్డినేటర్ బుచ్చయ్య, తాళ్లపల్లి రమేశ్, రాయిపెల్లి యాకయ్య తదితరులున్నారు.
ఓరుగల్లుకు నేపాల్ మేయర్లు
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: వరంగల్ సిటీలో శానిటేషన్ విధానాలను పరిశీలించేందుకు నేపాల్ దేశానికి చెందిన మేయర్లు, మున్సిపల్ఆఫీసర్లు ఆదివారం ఓరుగల్లుకు వచ్చారు. వడ్డేపల్లి జంక్షన్ వద్దనున్న పబ్లిక్ టాయిలెట్, ఎంహెచ్ నగర్ లోని టాయిలెట్లను పరిశీలించారు. ఆదర్శనగర్ లో స్లడ్జింగ్, డిస్లడ్జింగ్ విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం మేయర్ గుండు సుధారాణిని కలిశారు. ఈ సందర్భంగా గుండు సుధారాణి సిటీలో అవలంబిస్తున్న శానిటేషన్ విధానాలను తెలియజేశారు. ఓడీఎఫ్ గా మారిన తీరు, మల వ్యర్థాల నిర్వహణ, చెత్త శుద్ధీకరణ గురించి వారికి చెప్పారు.
బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్
జనగామ అర్బన్, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ స్టేట్ లీడర్ నాగపురి కిరణ్ కుమార్ అన్నారు. జనగామ పట్టణానికి చెందిన బి. నీరజ అనే యువతి నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష ఆర్థిక సాయం మంజూరైంది. ఆదివారం ఇందుకు సంబంధించిన ఎల్ వోసీని ఆయన బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో లీడర్లు శ్రీనివాస్, మల్లేశ్, ఉదయ్ కుమార్ తదితరులున్నారు.
గంజాయి సేవిస్తున్న యువకుల అరెస్ట్
కమలాపూర్, వెలుగు: కమలాపూర్ మండలంలోని గూనిపర్తి గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఆదివారం గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. మాదన్నపేట శివారులోని తాటి వనంలో కొంత మంది గంజాయి తాగుతున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ఏడుగురు యువకులను పట్టుకుని, వారి నుంచి రెండు హుక్కా పాట్స్స్, సిగరెట్ బడ్స్, 5 సెల్ఫోన్లు, 510 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నలుగురు బీటెక్, ఒకరు డిగ్రీ, మరొకరు ఐటీఐ స్టూడెంట్ ఉన్నారని సీఐ సంజీవ్ కుమార్ తెలిపారు.
బీసీ గణన చేపట్టాలి
వర్ధన్నపేట, వెలుగు: దేశంలో బీసీ గణన చేపట్టాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు రవి కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం వర్ధన్నపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్పితే వారి అభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కితేనే సమస్యలు తీరుతాయన్నారు. తనకు వర్ధన్నపేట నియోజకవర్గానికి పార్టీ బాధ్యతలు అప్పగించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కు థ్యాంక్స్ చెప్పారు.