- 25 రోజుల కింద టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చండూరు జడ్పీటీసీ
- మళ్లీ గులాబీ పార్టీలోకి...
చండూరు, వెలుగు : ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఇందులోంచి మరొకదాంట్లోకి మారడం సహజంగా జరిగేదే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక పార్టీలోకి జంప్ చేసిన కొన్ని రోజులకే మరో పార్టీలోకి దూకడం కామనైపోతోంది. అలాంటి ఘటనే ఒకటి నల్గొండ జిల్లాలోనూ జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం సెప్టెంబర్ 20న హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. మళ్లీ ఏమైందో ఏమో గానీ, మంగళవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన సమక్షంలో మళ్లీ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
బలవంతంగా తీసుకెళ్లారు !
ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బలవంతంగా బీజేపీలోకి తీసుకువెళ్లారని, అక్కడికి వెళ్లిన తర్వాత మనోవేదనకి గురయ్యానన్నారు. మండలంలోని అభివృద్ధి పనులు అధికార పార్టీతోనే సాధ్యమవుతాయని భావించి మళ్లీ టీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు.