మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ప్రజలకు తాను చేసిన అభివృద్ధికి ఎక్కలేదని, మాయమాటలు చెప్పి మార్పు మత్తు ఎక్కించారని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూకబ్జాల పేరుతో తనను బద్నాం చేశారన్నారు. కన్నతల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచారని, అలాంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోవాలన్నారు.
మరి కొందరు తన వద్ద రూ.10 లక్షలు తీసుకుని పార్టీ మారారని ఆరోపించారు. ఎన్నికల తరువాత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.