ప్రజల్లో చైతన్యం వస్తేనే పాలకుల్లో మార్పొస్తది

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నినాదం ఆకర్షణీయంగా ఉంది. అయితే ఎవరి కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పాలకుల ప్రచారం కోసమా? లేక స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఆచరణలో పెట్టడానికా? అనే ప్రశ్న ఎదురవుతున్నది. ప్రజాప్రతినిధులు, నేటి పాలకులు అంతర్మథనం, ఆత్మవిమర్శ చేసుకోవడానికి అన్ని స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టుకొని.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నుంచి స్థానిక ప్రజాప్రతినిధి, వార్డుమెంబర్ వరకు సమూలంగా మార్పులు చేసుకోగలగాలి. అప్పుడే ఆనాటి స్వాతంత్ర్య పోరాటయోధుల త్యాగాలు అందిపుచ్చుకున్న వాళ్లవుతారు. ఇలా జరగాలంటే ప్రజాప్రతినిధులు.. ప్రజాసేవకులుగా మారాలి. ప్రజాప్రతినిధుల్లో సేవాతత్పరత ఎంత పెరిగితే, అదే మోతాదులో ప్రజాస్వామ్య విలువలకు దేశం నిలయం అవుతుంది. ఇంటి యజమాని ఉత్తముడైతే, ఇంటిలోని వారందరూ అదే ప్రవర్తనకు అలవాటు పడతారనే నానుడిలాగా, ప్రభుత్వ యంత్రాంగంపై విధిగా ఆ ప్రభావం పడక తప్పదు. 

స్వతంత్ర భారతంలో ఏడు దశాబ్దాలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతోంది. అది ఆశించిన ఫలితాలు ఎంతవరకు ఇచ్చింది? ఇవ్వకపోతే దానికి కారణాలేమిటి? అనే కనీస సమీక్ష ఉండాలనే అంశంపై మేధావులు, ప్రజల్లో చర్చ సాగాలి. ప్రజాస్వామ్య మూలసూత్రాల అమలేది? ప్రాథమిక హక్కులెక్కడ? విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం వీటికి సంబంధించి పాలకులకు ధ్యాస ఉన్నదా? ఇలాంటి సమస్యలపైనా అంతర్మథనం, సమీక్ష ఎందుకు ఉండదు. అప్పటి స్వాతంత్ర్య ఉద్యమ తీరుతెన్నులు, త్యాగధనుల పేర్లను స్మరించడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ వాళ్లు ఆశించిందేమిటి? ధనవంతుడు, బలవంతుడై మరింత కుబేరుడుగా ఎదగడానికి, పేదవారు మరింత నిరుపేదగా మారి నిరంతరం ఆవేదనలు, ఆర్తనాధాల మధ్య బతకడానికా? అనే ప్రధాన విషయాలను ఎలా గాలికి వదిలేస్తారు. 

దేశంలో  4 వేల మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసులు

ఆనాటి నాయకులు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. స్వాతంత్ర్యం తమ జన్మహక్కుగా భావించారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలనుకున్నారు. సోషలిస్టు, స్వావలంబన, లౌకికతత్వం అంశాలకు రాజ్యాంగంలో పెద్ద పీట వేశారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాభక్షకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పాలకులవుతున్నారు. చైతన్యం లేని అమాయక ప్రజలకు సంక్షేమ పథకాలను ఎరచూపి ఓట్లు లాగేసుకుంటున్నారు. దేశంలోని 4,226 మంది ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులుండటం, ఎలాంటి ప్రజాస్వామ్యమో అర్థం చేసుకోవాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కార్పొరేట్ సంస్థల అధిపతులుగానో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గానో లేక బడాబడా కంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలుగా ఉంటే అది ఎలాంటి ప్రజాస్వామ్యం అవుతుంది. ఇదంతా చూస్తుంటే కార్పొరేట్, ప్రత్యక్ష దోపిడీ శక్తుల చేతుల్లో దేశమాత పూర్తిగా బందీ అయ్యిందని చెప్పడం లేదు.

ప్రజలను నట్టేట ముంచుతున్నరు

ప్రజలపై పరోక్ష పన్నులు ఒకచేతితో వసూలు చేసుకుని, మరో చేతితో కాకికి ఎంగిలి మెతుకులు వేసినట్టుగా సంక్షేమ పథకాలు అందించడమంటే ప్రజలను నమ్మించి నట్టేట ముంచడమే అవుతుంది. 75 వసంతాల ఉత్సవాలతోనైనా కేంద్ర, రాష్ట్ర పాలకులు మొదట ఆనాటి దేశ భక్తుల త్యాగాలను పుణికి పుచ్చుకుంటేనే ఆజాదీ కా అమృత్​ ఉత్సవాలకు సార్థకత ఉంటుంది. మొదట పాలకులు అంతర్మథనం, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలకు సేవ చేయడానికి కనీస ప్రతిజ్ఞ తీసుకోవాలి.ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి, ప్రజల ద్వారా, ప్రజల కొరకు పనిచేసేదే నిజమైన ప్రజా ప్రభుత్వమవుతుంది. నేటి ప్రజాస్వామ్యం “నేతి బీరకాయలో నెయ్యి” ఎంత ఉంటుందో, అంతే నిజమైన పాలన ఉందనటంలో ఎలాంటి అనుమానం లేదు.

ఎన్నికల ప్రక్రియ అదుపు తప్పుతున్నది

ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కూడా అదుపు తప్పుతోంది. అనేక అవరోధాల మధ్య మత, కుల, ప్రలోభాలు, శుష్కవాగ్దానాలు, అర్థబలం, అంగబలం, అధికార బలంతో అడ్డదారులు తొక్కుతూ, ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ, ప్రజాస్వామ్య విలువలకు ఇప్పటి నాయకులు పాతరేస్తున్నారు. ఎన్నికలంటే లాభసాటి వ్యాపారంగా మారింది. ప్రతి ప్రజాప్రతినిధికి ఏదో ఒక రకమైన వ్యాపారం ఉంటోంది. పారిశ్రామికవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, సహజ వనరులను కొల్లగొట్టడం లాంటి అనేక పద్ధతుల్లో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. మరొకవైపు హంతకులు, గుండాలు, హత్యాచారాలు చేసే వారే ప్రజాప్రతినిధులైతే, ప్రజాస్వామ్య నిర్వచనమే తలకిందులవుతుంది. అందుకే గత ఏడాది ఫిబ్రవరిలో ప్రజాప్రతినిధుల నేరపూరిత కేసులపై సీరియస్ గానే స్పందించిన సుప్రీంకోర్టు, ఇలాంటి కేసుల సత్వర పరిష్కారానికి ఆదేశాలిచ్చింది. దాదాపు 4,226 మంది ప్రజాప్రతినిధులపై కేసులా? అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండటం వ్యవస్థకే తలవంపులు తెస్తోంది. ‘‘యధారాజా తథా ప్రజ” అనే సామెతను విన్నాం. అది అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ ఆచరణీయమైనదే, వాస్తవమైనదే. ప్రజాప్రతినిధుల్లో మార్పు వచ్చినప్పుడు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమంలో సాగిన అహింసా, హింసా పోరాటాలను గ్రహిస్తూ, వారి త్యాగాలను నేటి తరానికి తెలియజేయడం నిజంగా ఆదర్శంగా ఉంటుంది. కానీ, ఆనాటి దేశభక్తుల త్యాగాల పేరుతో తూ.తూ. మంత్రంగా ఉత్సవాలు చేసుకోవడమంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం చేయడమే అవుతుంది. ఈ విషయాన్ని నేటి ప్రభుత్వాలు మొదట తెల్సుకోవాలి.

ప్రజల్లోనూ ఆ మార్పు వస్తేనే..

కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఏదో కొన్ని చోట్ల మినహాయింపులున్నా మెజారిటీ పాలకులు నియంతృత్వ, నిరంకుశ పాలన సాగిస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపులకైతే హద్దులే లేవు. ప్రభుత్వయంత్రాంగం చట్టాలను గాలికి వదిలేసి.. పాలకులకు భజన చేస్తూ చెప్పిన పని చేసే దుస్థితిలోకి వెళ్లిపోయారు. అందులో ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులనే తేడా అసలే లేదు. న్యాయవ్యవస్థకు కూడా కళంకం అంటగట్టే పరిస్థితి దాపురించింది. అవినీతికి అడ్రెసెక్కడంటే? నేను లేనిచోటే లేదంటుంది. భూతద్దంలో పెట్టి చూసినా పారదర్శకత అనేది కనిపించడం లేదు. కరోనాలో కూడా ప్రజల బాధలను గుర్తించేవారు లేకపోతే ఎలా? ప్రజలలో చైతన్యం రావాలి. అప్పుడే పాలకుల్లో మార్పు వస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం, మరోవైపు ఎన్నికలు, ఇంకొక వైపు ఉద్యమాలు కొనసాగడం భారతావని ప్రత్యేకత. ప్రజా ఆరోగ్యం కూడా పట్టకుండా ఎన్నికలు, అధికారం.. ఈ ఆలోచనలతో నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు. ప్రజలు తమ కోసం నిస్వార్థంగా ఎవరు పని చేస్తున్నారనేది గుర్తెరిగి.. అవినీతి,  నేరచరిత్ర లేని నాయకులను పాలకులుగా ఎన్నుకొని ఉంటే ఈ దుస్థితి రాకపోయేది. ఉచిత పథకాలకు లొంగిపోకుండా ఇప్పటికైనా ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజాస్వామ్యంగా చెప్పే మన దేశంలో నిజమైన ప్రజా సేవలను ఎన్నుకుంటేనే ప్రజాధనం అవినీతిపరులపాలు కాకుండా ఉంటుంది. అప్పుడే స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు నిజమైన అమృతోత్సవం జరిగినట్టని  ప్రజలు, పాలకులు గుర్తించాలి. రైతు ఉద్యమాలు, ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనలు, కార్మికుల ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయనేది పాలకులు ఆత్మ విమర్శ చేసుకోకుండా ఉత్సవాలు జరుపుకోవడం ఏ మాత్రం సరైన విధానం కాదు. ప్రజల కష్టాలు, సమస్యలపై  సహేతుకంగా ఆలోచించి పరిష్కరించే పెద్ద మనసు నాయకులకు ఉన్న నాడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం.

అంబేద్కర్ ఆశించిందేమిటి?

దేశ సామాజిక, ఆర్థిక తదితర అనేక అంశాలు, కులాల నిచ్చెనమెట్లు, మతాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ప్రాంతాలు, తెగల వివక్ష లేకుండా అందరి భవిష్యత్ బాగుండాలనే ఆకాంక్షతోనే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, అనేక అధికరణలను పొందుపరిచారు. ప్రజాప్రతినిధి రాజ్యాంగం మీద ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపడతారు. తర్వాత వాటిని అమలు చేయకపోతే సమీక్ష ఏది? “కంచే చేను మేసిన” సామెతలాగా.. దున్నపోతు ఈనిందంటే దొడ్లో కట్టేయమనే మరో సామెత లాగా నీచ, నికృష్టమైన వ్యవస్థ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వలన ఎలా మేలు కలుగుతుంది. గాంధీ, అంబేద్కర్ సామాజిక స్పృహతో ఆలోచిస్తే, నేటి పాలకులు అధికార గర్వంతో సర్వస్వం తామే అనుకుంటూ విర్రవీగడం దారుణం. 
                                                                                               ....చాడ వెంకటరెడ్డి,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి