- మరోసారి 15 శాతం ట్యాక్స్ రేటు స్కీమ్‌ను తీసుకొచ్చే అవకాశం
న్యూఢిల్లీ: ట్యాక్స్ రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. యూఎస్‌లోని ట్రంప్ ప్రభుత్వం చైనాకు వ్యతిరేకంగా పాలసీలు తెస్తుండడంతో, చైనాకు ఆల్టర్నేటివ్‌గా ఎదగాలని ఇండియా చూస్తోంది.
రానున్న బడ్జెట్‌లో కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కొన్ని సెక్టార్లపై కార్పొరేట్ ట్యాక్స్ రేటును 15 శాతానికి తగ్గించొచ్చని తెలిపారు.
ఇదే జరిగితే భారీగా ఇన్వెస్ట్‌మెంట్లు వస్తాయని, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వివరించారు. కాగా, మినహాయింపులను వదులుకునే డొమెస్టిక్ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్‌లో రాయితీలను 2019, సెప్టెంబర్‌లో ప్రభుత్వం కల్పించింది.
కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి (సెస్, సర్‌చార్జ్ మినహాయించి) తగ్గించింది. కొత్తగా పెట్టే మాన్యుఫాక్చరింగ్ కంపెనీలపై ఈ రేటు 15 శాతానికి (సెస్, సర్‌చార్జ్ కలిపి) దిగొచ్చింది.
ఈ స్కీమ్ 2024 మార్చి 31 తో ముగిసింది. సెకెండ్ వెర్షన్‌లో కేవలం కొత్త మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకే కాకుండా, ఉద్యోగాలను క్రియేట్ చేసే సర్వీసెస్ కంపెనీలకు కూడా ట్యాక్స్ రాయితీలను ప్రభుత్వం ఇవ్వొచ్చు.