వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమ రాజకీయ, ఎన్నికల వ్యూహాలను దెబ్బతీసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయింది. హర్యానాలో అధికారం నిలబెట్టుకోగలిగినా.. స్థాయికి తగ్గ పనితీరు కనబరచలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి గల ప్రాధాన్యతను గుర్తించింది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు బీజేపీ ఇప్పుడు బోల్డ్ డెసిషన్లను తీసుకుంటోంది.
పార్టీపై కాదు.. వ్యక్తులపైనే వ్యతిరేకత
సెఫాలజీ థియరీ ప్రకారం.. ప్రభుత్వ వ్యతిరేకత అనేది పార్టీకి వ్యతిరేకం కాదు. వ్యక్తులకు వ్యతిరేకంగానే ఇది పనిచేస్తుంది. ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడం ద్వారా రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకతను కొంత వరకూ తగ్గించగలుగుతాయి. అలాగే, పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని తప్పించడం కూడా చేస్తుంటాయి. దీని వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం కొంత వరకూ చల్లబడుతుంది. ఒక రాష్ట్రంలో సీఎం అభ్యర్థిని మార్చడం ద్వారా, సదరు పార్టీ అప్పటి వరకూ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను చెరిపేయగలుగుతుంది. కొత్త ఫేస్, సరి కొత్త హామీలతో మళ్లీ జనంలోకి వెళ్లగలుగుతుంది. ఇది ఫైనల్‌గా మళ్లీ పబ్లిక్ సపోర్ట్‌ను సంపాదించేందుకు సహాయపడుతుంది.
కొత్త పొలిటికల్ స్ట్రాటజీ
నాయకత్వ మార్పు ద్వారా రాష్ట్ర శాఖల్లో కొత్త తరానికి అవకాశం ఇచ్చే పొలిటికల్ స్ట్రాటజీని ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతోంది. ఈ కొత్త నాయకత్వం ప్రతిపక్షంలో ఉన్న పార్టీని బతికించడానికి, తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సహాయపడుతుందని భావిస్తోంది. 2019 జనరల్ ఎలక్షన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ స్ట్రాటజీ మొదలైంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ తోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఆ ఎన్నికల్లో ఓటమిపాలైంది. జార్ఖండ్‌లో ఓటమిని బీజేపీ అసలు ఊహించలేదు. రఘుబర్‌దాస్ ఓవర్ కాన్ఫిడెంట్‌తో విజయం తమదే అనేలా బీజేపీ లీడర్షిప్ను తప్పుదారి పట్టించారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే, అక్కడ బీజేపీ సాధారణ మెజారిటీ కూడా సాధించలేకపోయింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. అక్కడ మహారాష్ట్ర వికాస్ అఘాడీగా పిలుస్తున్న ప్రతిపక్ష మహా కూటమి విజయం సాధించింది. దానికి నేతృత్వం వహించిన శివసేన అధికారంలోకి వచ్చింది. హర్యానాలో కూడా ఇదే మాదిరిగా మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా అసెంబ్లీలో కావాల్సిన మెజారిటీ సాధించలేకపోయారు. దీంతో అక్కడ బీజేపీ నాయకత్వం దుష్యంత్ చౌతాలా పార్టీ అయిన జన్నాయక్ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాల్సి వచ్చింది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దుష్యంత్‌కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టును ఇవ్వాల్సి వచ్చింది.
వ్యూహాలకు పదును
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బీజేపీ తన పొలిటికల్ స్ట్రాటజీలపై పునరాలోచనలో పడింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే దానిపై వ్యూహాలకు పదునుపెట్టింది. కర్నాటక నుంచే సరికొత్త ప్లాన్‌ను అమలు చేయడం స్టార్ట్ చేసింది. కర్నాటకలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రాన్ని ఎన్నికలకు సిద్ధం చేసేలా అడుగులు వేసింది. మొదటి మేజర్ స్టెప్‌గా ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసింది. యడియూరప్పను పక్కనపెట్టి ఒకప్పటి జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రిని చేసింది. అలాగే గుజరాత్లో అయితే ముఖ్యమంత్రి మార్పుతో సరిపెట్టలేదు. మొత్తం కేబినెట్‌నే మార్చేసింది. అప్పటి ముఖ్యమంత్రి విజయ్రూపానీపై ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరిందని గ్రహించిన పార్టీ హైకమాండ్ ఆయన ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ, నలుగురు ముఖ్యమంత్రులను బీజేపీ హైకమాండ్ పక్కన పెట్టింది. ఈ లిస్ట్‌లో కర్నాటకలో యడియూరప్ప, ఉత్తరాఖండ్ లో త్రివేంద్రసింగ్ రావత్, తీర్థ్‌సింగ్ రావత్, గుజరాత్లో విజయ్రూపానీని తప్పించింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్‌కు హింట్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత హిమంత బిశ్వశర్మకు పగ్గాలు ఇవ్వాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అక్కడ సిట్టింగ్ సీఎంను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. అలాగే బిశ్వశర్మను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎనౌన్స్ చేయలేదు. కానీ, సర్బానంద్ సోనోవాల్ స్థానాన్ని బిశ్వశర్మ రీప్లేస్ చేశారు.
యూపీలో మాత్రం యోగిపైనే భారం
హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒక్క దాంట్లోనే బీజేపీ ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేయలేకపోయింది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో పార్టీ మొత్తం బరువు బాధ్యతలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పైనే వదిలేయాలని పార్టీ నిర్ణయించుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ హిందూత్వ కార్డే పార్టీని కాపాడుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. యోగి ఆదిత్యనాథ్ కూడా ఇప్పటికే తన ఎజెండా సెట్ చేసుకున్నారు. దళితులపై దాడులు, లవ్ జీహాద్, హత్రాస్ గ్యాంగ్‌రేప్, రైతుల ఆందోళనలు, వలస కార్మికుల వెతలు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైఫల్యం మొదలైన అన్ని అంశాలను యోగి పక్కకు నెట్టేయగలిగారు. సీఎంను మార్చాలనే విషయంలో యూపీలో మాత్రమే పార్టీ హైకమాండ్‌కు కాస్త ప్రతిఘటన ఎదురైంది. దీంతో తన పాలసీకి కొన్ని మార్పులు చేసుకుని ఎన్నికల వరకూ అక్కడ ఆయననే కొనసాగించాలని నిర్ణయించుకుంది.
ఆ ముగ్గురి ప్లానింగే
ఈ పొలిటికల్ స్ట్రాటజీ ముగ్గురు టాప్ లీడర్ల ఆలోచనే. ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయితే మరొకరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఇంకొకరు బీజేపీ జనరల్ సెక్రెటరీ(ఆర్గనైజేషన్) బీఎల్ సంతోశ్. ఐదుగురు ముఖ్యమంత్రులను మార్పుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారీ అది రాజకీయంగా ఆసక్తిని క్రియేట్ చేసింది. ప్రతిపక్ష పార్టీల అంచనాలకు అందలేదు. నాలుగో వ్యక్తికి తెలియకుండా ఈ ప్రక్రియ మొత్తం నడిచింది. ముఖ్యమంత్రుల మార్పుకు సంబంధించిన ప్లానింగ్ అంతా చాలా రహస్యంగా సాగింది. మీడియాకుగానీ, పొలిటికల్ ఎనలిస్టులకుగానీ ఏం జరుగుతోందనే దానిపై చిన్న హింట్ కూడా లేదు. రాష్ట్రాల వారీగా సీఎంల మార్పు మొదలైన తర్వాతే విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ బీజేపీ ఐదుగురు ముఖ్యమంత్రులను మార్చింది. అయినా ఎక్కడా వ్యతిరేకత అనేది బయటకు రాలేదు. సీఎంల మార్పుకు సంబంధించిన ప్లానింగ్ అంతా స్మూత్‌గా జరిగింది. పైగా పదవి నుంచి దిగిపోయిన ఐదుగురు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా పార్టీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి, తమతమ రాష్ట్రాలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు పార్టీ లీడర్షిప్కు ధన్యవాదాలు తెలిపారు.
- పర్సా వెంకట్, పొలిటికల్ ఎనలిస్ట్