
- నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని ధరణి తెచ్చిన్రు
- ఆరు నెలలు కసరత్తు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి తెచ్చినం
గద్వాల/నాగర్‌కర్నూల్, వెలుగు : భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌లో ఏమైనా సమస్యలు వస్తే.. రూల్స్ మార్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గద్వాల జిల్లా ధరూర్, నాగర్‌కర్నూల్ జిల్లా గగ్గలపల్లిలో శనివారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని తీసుకొచ్చిన ధరణితో ఎంతో మంది రైతులు కష్టాలు పడ్డారన్నారు. ఆ ఇబ్బందులను తొలగించేందుకే ఆరు నెలలు కసరత్తు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు.
ధరణిలో అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తుకు రూ. వెయ్యి చెల్లించాల్సి వచ్చేదని, ఆయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆఫీసు చుట్టూ రైతులు తిరిగేవారన్నారు. కానీ భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ ఆఫీసర్లే గ్రామానికి వచ్చి సమస్యలు తెలుసుకుంటారని, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ధరణి 9,26,000 సాదాబైనామాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి భూభారతి ద్వారా పరిష్కారం చూపామన్నారు. ధరణి చట్టాన్ని అడ్డు పెట్టుకొని ప్రత్యర్థి రాజకీయ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధించారని, రైతుల పేర్లు తొలిగించారని ఆరోపించారు. భూమి లేకపోయినా.. బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పాస్‌బుక్స్, రైతు బంధు డబ్బులు ఇచ్చారని మండిపడ్డారు. ధరణిపై అవగాహన సదస్సులు పెడితే అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల వీపులు చింతపండు అయ్యేవన్నారు. తమ మాట వినలేదన్న కోపంతో వేలాది మంది వీఆర్‌ఓలను రోడ్డున పడేశారన్నారు.
కొత్త చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపైనే ఉందని, ఆఫీసర్లు మొక్కుబడి సమావేశాలు నిర్వహించకుండా రైతులకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఆధార్ కార్డుల మాదిరిగానే ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇస్తామని ప్రకటించారు. గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ సంతోష్, టీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింహారావు, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ భూపాల్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
హెలీప్యాడ్ సమీపంలో మంటలు
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్ వద్ద మంటలు చెలరేగడం కలకలానికి గురి చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతుండగా స్మోక్ బులెట్ పేల్చారు. అది హెలిప్యాడ్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న గడ్డిలో పడడంతో మంటలు చెలరేగాయి. గమనించిన ఫైర్, పోలీస్ సిబ్బంది వెంటనే మంటలను
ఆర్పివేశారు.
సర్కార్‌ను బద్నాం చేసే కుట్ర : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ఏఐని ఉపయోగిస్తూ అవాస్తవాలు, అసత్యాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రను ప్రజలే తిప్పికొడతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను 64 ఏండ్ల పాటు పాలించిన 21 మంది సీఎంలు రూ.64 వేల కోట్ల అప్పు చేస్తే తెలంగాణ ఏర్పాటైన పదేండ్లలోనే బీఆర్‌ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. భూభారతితో ధరణి కష్టాలు తీరుతాయన్నారు.