బీ అలర్ట్: అక్టోబర్ ఒకటి నుంచి ఇవన్నీ మారుతున్నాయి.. అందరూ తెలుసుకోవాలి..!

బీ అలర్ట్: అక్టోబర్ ఒకటి నుంచి ఇవన్నీ మారుతున్నాయి.. అందరూ తెలుసుకోవాలి..!

అక్టోబర్ 1వ తేదీ నుండి దేశంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రోజువారీ అంశాలతో పాటు కొన్ని ఆర్థిక పరమైన అంశాలు, కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి మార్పులు జరగనున్నాయి. కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నిబంధనలు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, సుకన్య సమృద్ధి యోజన (SSY),  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఆధార్ కార్డ్ వంటి పొదుపు పథకాలకు సంబంధించిన అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవాళ్టి (సెప్టెంబర్ 30)తో ఈ నెల ముగియునుండటంతో రేపటి (అక్టోబర్ 1) నుండి జరగనున్న మార్పుల గురించి కింద తెలుసుకుందాం.

ఎల్పీజీ గాస్ సిలిండర్ ధర:

సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 2024 కొరకు సవరించిన రేట్లను అక్టోబర్ 1 ఉదయం 6 గంటలకు చమురు కంపెనీలు అనౌన్స్ చేస్తాయి.19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఇటీవల తరచుగా మార్పులు జరుగుతుండగా.. 14 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మాత్రం అక్కడ స్థిరంగా ఉంటున్నాయి. ఎన్నికలు, ఇతర రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని వంట గ్యాస్ ధరలను పెంచేందుకు ఆయిల్ కంపెనీలు ధైర్యం చేయడం లేదు.

ఆధార్ కార్డు నిబంధన మార్పు

 ఆధార్ నంబర్‌కు బదులుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడిని పేర్కొనడాన్ని అనుమతించే నిబంధనను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయిం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ డెసిషన్ రేపటి (అక్టోబర్ 1) నుండి అమల్లోకి రానుంది. ఇకపై పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్ కార్డ్) పత్రాలలో తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని అప్లికేషన్ దారులు వెల్లడించాల్సిన అవసరం లేదు. 

పీపీఎఫ్ నియమంలో మార్పు:

అక్టోబర్ 1, 2024 నుండి తప్పుడు వివరాలతో ఉన్న పీపీఎఫ్ ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజనతో పాటు పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణకు సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రకారం.. రేపటి నుండి మైనర్‌ల పేరుతో తెరిచిన ఖాతాల క్రమబద్ధీకరణ, బహుళ పీపీఎఫ్ ఖాతాలు, ఎన్ఆర్ఐ పీపీఎఫ్ ఖాతాలు పొడిగించబడతాయి.

ఇన్‎కమ్ ట్యాక్స్ నిబంధనలో మార్పులు

కేంద్ర బడ్జెట్ 2024లో ఇన్‎కమ్ ట్యాక్స్‎కు సంబంధించి మోడీ ప్రభుత్వం కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ మార్పుల్లో కొన్ని అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. టీడీఎస్‎లో గణనీయమైన మార్పు మంగళవారం నుండి జరగనుంది. కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. నిర్దిష్ట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లపై 10%  టీడీఎస్ వర్తించనుంది. అదనంగా, జీవిత బీమా పాలసీ, ఇంటి అద్దె చెల్లింపు మొదలైన వాటికి సంబంధించి టీడీఎస్ చెల్లింపు రేపటి నుండి మారనుంది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ ఛేంజ్

స్మార్ట్ బై ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో యాపిల్ ఉత్పత్తుల కోసం రివార్డ్ పాయింట్‌ల రిడెంప్షన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్  పరిమితం చేసింది.