- రూపే క్రెడిట్ కార్డుతో ఎయిర్‌పోర్ట్ లాంజ్ విజిట్స్
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం. ఎన్‌బీఎఫ్‌సీల ఎఫ్‌డీ రూల్స్, రూపే క్రెడిట్ కార్డ్ కొత్త పాలసీ వంటివి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈపీఎఫ్‌ఓ మరిన్ని ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఏడాది అమల్లోకి వచ్చిన, వస్తున్న కొత్త ఫైనాన్షియల్ రూల్స్ కింద ఉన్నాయి...
ఫిక్స్డ్ డిపాజిట్ మార్పులు
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీల), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ)లకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రూల్స్‌ను ఆర్‌బీఐ మార్చింది. జనవరి 1 నుంచి ఈ కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా కాల పరిమితి పూర్తికాకుండా విత్‌డ్రా చేసుకోవాలనుకునే ఎఫ్‌డీల రూల్స్ మారాయి. ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల్లో ఎఫ్‌డీలు చేసిన వారు చేసిన మూడు నెలల్లోపు రూ.10 వేల వరకు ఎటువంటి వంటి వడ్డీ లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు.
రూ. 5 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ఎఫ్‌డీ చేస్తే మూడు నెలల్లోపు 50 శాతం వరకు వడ్డీ లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. తీవ్ర అనారోగ్యంతో బాధపడితే ఎఫ్‌డీ టెనూర్‌తో సంబంధం లేకుండా మొత్తం అమౌంట్‌ను వడ్డీ పొందకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. అలానే ఎన్‌బీఎఫ్‌సీలు ఇక నుంచి ఎఫ్‌డీలు మెచ్యూర్ అయ్యే రెండు వారాల ముందు నుంచే మెచ్యూరిటీ వివరాలను కస్టమర్లకు అందిస్తాయి. ఎప్పటికప్పుడు ఎఫ్‌డీలకు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేస్తాయి.
లాంజ్ సర్వీస్..
రూపే క్రెడిట్ కార్డు హోల్డర్లు జనవరి 1 నుంచి ఎయిర్‌పోర్ట్ లాంజ్ సర్వీస్‌లను ఫ్రీగా పొందడానికి వీలుంటుంది. ఢిల్లీలో ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ముందు క్వార్టర్‌లో రూపే క్రెడిట్ కార్డుతో చేసిన ఖర్చు ఆధారంగా లాంజ్ యాక్సెస్ ఉంటుంది. ఒక క్వార్టర్‌లో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తే ఆ తర్వాతి క్వార్టర్‌లో రెండు కాంప్లిమెంటరీ లాంజ్ విజిట్స్‌ను పొందొచ్చు. రూ.50 వేల నుంచి రూ. లక్ష మధ్య ఖర్చు చేస్తే నాలుగు కాంప్లిమెంటరీ విజిట్స్, రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల లోపు ఖర్చు చేస్తే ఎనిమిది కాంప్లిమెంటరీ విజిట్స్ పొందొచ్చు. అదే రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఒక క్వార్టర్‌లో అన్‌లిమిటెడ్ కాంప్లిమెంటరీ విజిట్స్ పొందొచ్చు. రూపే క్రెడిట్ కార్డులలో సెలెక్ట్, ప్లాటినం వంటి హయ్యర్ వేరియంట్లతోనే ఈ కాంప్లిమెంటరీ విజిట్స్ పొందడానికి వీలుంటుంది.
ఈపీఎఫ్‌ఓలో ఇవి మారాయి
పీఎఫ్ అమౌంట్‌ను ఈ నెల నుంచే ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త ఫెసిలిటీని తీసుకురావాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ) చూస్తోంది. సబ్‌స్క్రయిబర్లకు ఏటీఎం కార్డులను మొదట ఇష్యూ చేస్తారు. వీటితో పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. మరోవైపు హయ్యర్ పెన్షన్ కోసం అప్లయ్ చేసుకోవాలంటే జనవరి 31 చివరి తేది. గతంలో పేర్కొన్న జనవరి 15 నుంచి పొడిగించారు. ఈపీఎఫ్‌ఓ ఈ–వాలెట్లను కూడా తీసుకొస్తోంది. పీఎఫ్ అమౌంట్‌ను ఈ–వాలెట్ల ద్వారా వాడుకోవచ్చు. అంతేకాకుండా పీఎఫ్ కోసం ఉద్యోగులు చేసే కంట్రిబ్యూషన్ లిమిట్‌ను తొలగించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగి బేసిక్ శాలరీలో 12 శాతాన్ని పీఎఫ్‌కు యాడ్ అవుతోంది. ఈ లిమిట్ తీసేసే ఆలోచనలో ఉన్నారు. వీటితో పాటు జనవరి 1 నుంచి ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ను తీసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌ఓ కల్పిస్తోంది. ఈపీఎస్ పెన్షనర్ల కోసం ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
యూపీఐ యాప్‌లకు ఊరట
ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌లకు ఎన్‌పీసీఐ ఊరటనిచ్చింది. ట్రాన్సాక్షన్లలో గరిష్టంగా 30 శాతం వాటానే ఒక యూపీఐ యాప్ నిర్వహించాలనే రూల్‌ను గత కొంత కాలంగా ఈ సంస్థ ప్రపోజ్ చేస్తోంది. ఈ రూల్ అమలు తేదీని 2026, డిసెంబర్ 31 కి తాజాగా పొడిగించింది.