- ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో 57వేల ఎకరాల్లో మామిడి తోటలు
- పెరిగిన తేమ శాతం.. రైతుల్లో ఆందోళన
- వచ్చిన పూత రాలకుండా, కొత్త పూత వచ్చేలా మందుల వాడకం
- 3 దశలుగా మందులు స్ర్పే.. ఎకరాకు రూ.40 వేలకు పైగా ఖర్చు
భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ, వెలుగు: ఉమ్మడి జిల్లాలో వాతావరణంలో మార్పులు మామిడి రైతులకు శాపంగా మారాయి. భూమిలో తేమ శాతం పెరిగింది. మామిడి చెట్లకు పూత రావడంలో ఆలస్యమవుతోంది. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. సాధారణంగా నవంబరు, డిసెంబరు నెలల్లో మామిడి పూత పూస్తుంది. కానీ డిసెంబర్లో రెండోవారం గడుస్తున్నా పూత జాడ లేకపోవడంతో రూ.లక్షలు వెచ్చించి రైతులు మందులను స్ప్రే చేయాల్సి వస్తోంది.
57 వేల ఎకరాల్లో తోటలు..
ఖమ్మం జిల్లాలో 45 వేల ఎకరాలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 12 వేల ఎకరాల్లో మామిడిని రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో బంగినపల్లి, కేసరి, తోతాపురి, హిమాయత్, చిన్న, పెద్ద రసాలు లాంటి రకాలను ఎక్కువగా పండిస్తున్నారు. గతేడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది ఆ నష్టాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనలో ఉన్న మామిడి రైతుల ఆశలు సీజన్ మొదట్లోనే పూత రాక ఆవిరవుతున్నాయి.
పూత కోసం రైతుల పాట్లు..
మామిడి తోటల్లో అరకొరగా పూసిన పూత ఆపేందుకు ఓ వైపు, కొత్తగా పూత వచ్చేందుకు మరో వైపు రైతులు నానా పాట్లు పడుతున్నారు. దీనికి తోడు పూత రసం పీల్చే నల్లి, పూతను తొలిచే పురుగు ఆశించాయని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున ఖర్చు చేస్తూ మూడు దఫాలుగా మందులు స్ప్రే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో అనుకున్న సమయానికి పూత వస్తే ఎకరానికి 5 టన్నుల దిగుబడి లభిస్తుందంటున్నారు.
ALSO READ : వ్యాపారులకు ఫేక్కాల్స్ టెన్షన్
హార్టికల్చర్ ఆఫీసర్లు పట్టించుకోవట్లే..
పంటల సీజన్ లో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ఉద్యాన వన శాఖ(హార్టికల్చర్) ఆఫీసర్లు మామిడి తోటలను పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. వచ్చిన పూత రాలకుండా, కొత్త పూత వచ్చేందుకు తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలపై ఆఫీసర్లు అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఆ దిశగా చర్యలు ఎక్కడా ఆకనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు మామిడి తోటలను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
రూ.2 లక్షలతో మందులు కొట్టించా..
ఇరవై ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న. ఇప్పటి వరకు పూత సరిగా రాలే. వచ్చిన కొంత పూతను పురుగు తొలిచేస్తున్నది. ఇప్పటికే రూ.2 లక్షలు పెట్టి క్లోరిఫై పాస్, సాఫ్ పొడి, ప్లానోఫాస్, ఇమడా మందులను చెట్లకు కొట్టించా. గతేడాది అనుకున్న దిగుబడి రాలే.. ఈసారైనా లాభాలు వస్తాయనుకుంటే పూతే లేదు. - షకీల్, రైతు, చండ్రుగొండ