
సమకాలీన ప్రపంచంలో ఆవిష్కరణలు, సృజనాత్మకత, కొత్త ఆలోచనల ప్రాముఖ్యత పెరిగింది. ఈ సృజనాత్మకతకు రక్షణ కల్పించేందుకు మేధో సంపత్తి హక్కుల (Intellectual Property Rights – IPR) వ్యవస్థ రూపొందింది. ఇవి ఆవిష్కర్తలకు, రచయితలకు, పరిశోధకులకు వారి సృజనాత్మకతపై యాజమాన్యాన్ని ఇచ్చేవిధంగా ఉంటాయి. కానీ, ఈ హక్కులు అన్ని సందర్భాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నాయా?
అవి కొన్నిసార్లు సామాన్య ప్రజలకుహాని చేస్తున్నాయా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒక కొత్త ఆవిష్కరణ లేదా సృజనాత్మకత సృష్టి చేసిన వ్యక్తికి ఆ హక్కును పరిరక్షించుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే, ఇతరులు దాన్ని అనుమతి లేకుండా వాడుకునే అవకాశం ఉంటుంది. ఐపీఆర్ వల్ల ఆవిష్కర్తకు ఆర్థిక ప్రయోజనం, గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది.
కొత్త సాంకేతికతలు, ఔషధాలు, కొత్త ఆవిష్కరణలు చేయడానికి సంస్థలు, పరిశోధకులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి. పేటెంట్‌లు లేకపోతే, వారు తమ పెట్టుబడిపై రాబడి పొందలేరు. దీనివల్ల పరిశోధనకు ఆటంకం కలుగుతుంది. ఐపీఆర్ వల్ల పరిశ్రమలో పోటీ పెరుగుతుంది. ఒక్కొక్కరికి ప్రత్యేక హక్కులు ఇచ్చినప్పటికీ, ఇతర సంస్థలు మరింత మెరుగైన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తాయి. ఇది సమాజానికి అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించేందుకు దోహదం చేస్తుంది.
రచన, చిత్రలేఖనం, సినిమాలు, సంగీతం వంటి కళారంగాల వారికి కాపీరైట్ హక్కులు ద్వారా వారి సృజనాత్మకతను పరిరక్షించుకోవచ్చు. ఇది కొత్త కళాకారులను ప్రోత్సహించే విధంగా ఉంటుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఐపీఆర్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు, తమ ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లో వాణిజ్యపరంగా నిలబెట్టుకునేందుకు ఐపీఆర్‌ను ఉపయోగిస్తాయి.
మేధో సంపత్తి హక్కులపై విమర్శలు
ఐపీఆర్వల్ల ఒక వ్యక్తి లేదా సంస్థకు ప్రత్యేక హక్కులు లభిస్తాయి. ఇది కొన్నిసార్లు పోటీని అణచివేసేలా మారుతుంది. పెద్ద సంస్థలు తమ పేటెంట్లను ఉపయోగించి చిన్న కంపెనీలను మార్కెట్‌లోకి ప్రవేశించకుండా చేయడమే కాకుండా, ఉన్న సంస్థలను కూడా నాశనం చేయగలవు.
ఔషధ పరిశ్రమలో పేటెంట్లు సాధారణ ప్రజలకు చేటు కలిగించేలా మారాయి. కొన్ని ఔషధ కంపెనీలు ఎవర్‌గ్రీనింగ్ వ్యూహాన్ని అనుసరిస్తూ, చిన్న మార్పులు చేసి కొత్త పేటెంట్లుగా మార్చుకుని, తక్కువ ధరలకు జనరిక్ ఔషధాలను అందకుండా చూస్తున్నాయి. దీనివల్ల వందల కోట్ల మంది ప్రజలు అత్యవసర ఔషధాలను కొనలేకపోతున్నారు. కొన్ని సంస్థలు లేదా వ్యక్తులు పేటెంట్లను వాణిజ్యపరంగా ఉపయోగించి, ఇతర కంపెనీలపై కేసులు వేసి వేధిస్తారు.
వీటిని పేటెంట్ ట్రోల్స్ (Patent Trolls) అంటారు. ఇవి అసలు ఆవిష్కరణలను చేయకుండా, ఇతరుల ఆవిష్కరణలపై తమ పేటెంట్లను రిజిస్టర్ చేసుకుని, వాటిపై కేసులు వేస్తూ డబ్బు వసూలు చేస్తుంటాయి. అమెరికా, యూరప్ వంటి దేశాలు ఐపీఆర్ విధానాలను మరింత కఠినతరం చేస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమస్యలు కలిగిస్తున్నాయి.
ఐపీఆర్ విధానంలో అవసరమైన మార్పులు
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా ఔషధ రంగంలో ఐపీఆర్‌ను మరింత న్యాయ సమ్మతంగా మార్చాలి. అత్యవసర ఔషధాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచేందుకు, పేటెంట్ కాలాన్ని తగ్గించడం లేదా కొన్ని ఔషధాలను ‘పబ్లిక్ డొమైన్’లో ఉంచడం అవసరం. కొన్ని కంపెనీలు అసలు ఉపయోగించని పేటెంట్లను సంపాదించి, ఇతరులను వేధించకుండా ఉండటానికి కఠినమైన చట్టాలు అవసరం.
ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటే, కొన్ని రంగాల్లో ఐపీఆర్ నిబంధనలను సడలించాలి. ముఖ్యంగా వైద్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో బలమైన ఐపీఆర్ విధానం ఉండకపోవడం మేలు. ఐపీఆర్ విధానం చిన్న పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లు ఉపయోగించుకునేలా సులభతరం చేయాలి. పేటెంట్ ఫీజులను తగ్గించడంతో పాటు, ప్రభుత్వం నుంచి నిధులు అందించే విధానాలు ఉండాలి.
మేధో సంపత్తి హక్కులు అనేవి ఆవిష్కర్తలకు రక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, మార్కెట్‌లో పోటీని పెంచేలా ఉండాలి. కానీ, ప్రస్తుత ఐపీఆర్ విధానం కొన్ని పెద్ద సంస్థలకు లాభసాటిగా మారి, సామాన్య ప్రజల అవసరాలను విస్మరిస్తున్నది. ముఖ్యంగా ఔషధాలు, సాఫ్ట్‌వేర్, విద్యారంగాల్లో ఐపీఆర్ మరింత సమర్థవంతంగా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేయాలి. ఐపీఆర్ ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా మారాలి.
పేటెంట్ నిలబెట్టుకోవడం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ
భారతదేశం, ఆఫ్రికా దేశాలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించడానికి తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతను ఉపయోగించాలనుకుంటున్నాయి. అయితే, ఐపీఆర్ కారణంగా ఇవి సాధ్యం కావడం లేదు. ఒక పేటెంట్ లేదా కాపీరైట్ పొందడం, దాన్ని నిలబెట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. చిన్న కంపెనీలు లేదా స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను రక్షించుకోవాలంటే ఎక్కువ నిధులు అవసరం. అంతేకాదు, ఒక్క దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా రక్షణ పొందాలంటే మరింత ఖర్చు అవుతుంది.
- మహేశ్వరం భాగ్యలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ -