కామారెడ్డి మున్సిపాలిటీలో మారుతున్న సమీకరణాలు

కామారెడ్డి మున్సిపాలిటీలో మారుతున్న సమీకరణాలు
  • అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలం పెంచుకుంటున్న కాంగ్రెస్​
  • బీఆర్ఎస్​ నుంచి అధికార పార్టీలోకి కౌన్సిలర్ల క్యూ

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అంతకు ముందు బీఆర్ఎస్​కు మెజార్టీ కౌన్సిలర్లు ఉండగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 
కౌన్సిలర్లు కాంగ్రెస్​లోకి క్యూ కడుతున్నారు. దీంతో క్రమంగా కాంగ్రెస్​ బలం పెరుగుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీలో 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ ​కండువా కప్పుకున్నారు. ఇందులో కొందరు గతంలో కాంగ్రెస్ ​నుంచి గెలిచి బీఆర్ఎస్​లో చేరిన వాళ్లు ఉండగా, మరికొందరు బీఆర్ఎస్​ నుంచి గెలిచిన వాళ్లు ఉన్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో 23 వార్డుల్లో బీఆర్ఎస్,12 వార్డుల్లో కాంగ్రెస్, 8 వార్డుల్లో బీజేపీ, ఆరింట ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మెజార్టీ సీట్లు బీఆర్ఎస్​ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడంతో  ఇండిపెండెంట్లుగా గెలిచిన ఆరుగురు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీని బీఆర్ఎస్​ కైవసం చేసుకుంది.

చైర్​పర్సన్​గా నిట్టు జాహ్నవి, వైస్ చైర్​పర్సన్​గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో ఆ పార్టీ హవా సాగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ ​నుంచి కేసీఆర్​కూతురు కల్వకుంట్ల కవిత పోటికి దిగారు. ఈ ఎన్నికల టైమ్​లో కాంగ్రెస్​కు చెందిన 7గురు కౌన్సిలర్లు గులాబీ గూటికి చేరారు. దీంతో ఆ పార్టీలో ఐదుగురు మాత్రమే మిగిలారు. గులాబీ పార్టీకి మెజార్టీ ఉండడంతో కౌన్సిల్ మీటింగ్​లోని ఎజెండా అంశాలు అన్నీ ఆమోదం పొందేవి.

అసెంబ్లీ ఎన్నికల నుంచి..

అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపాలిటీలో సమీకరణాలు మారాయి. ఎన్నికల టైమ్​లో బీఆర్ఎస్​కు చెందిన మున్సిపల్ వైస్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ, ఆమె భర్త చంద్రశేఖర్​రెడ్డిని పార్టీ నుంచి సస్సెండ్​ చేసింది. దీంతో ఆమె తన భర్తతో పాటు మరో కౌన్సిలర్​తో కలిసి కాంగ్రెస్​లో చేరారు. ఆ తర్వాత మరో ఇద్దరు కౌన్సిలర్లు హస్తం గూటికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ ​తరఫున కేసీఆర్ పోటీ చేశారు. అధినేత పోటీ చేస్తున్న  టైమ్​లో కౌన్సిలర్లు పార్టీ మారడం చర్చకు తావిచ్చింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్​ ఓడిపోవడమే కాకుండా రాష్ట్రంలోనూ బీఆర్ఎస్​అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారం చేపట్టింది.

దీంతో ఇటీవల మరో ఐదుగురు బీఆర్ఎస్ ​కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ బలం 15కు చేరింది. పార్టీ మారిన వైస్​ చైర్​పర్సన్ ​గడ్డం ఇందుప్రియపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు మీటింగ్​ నిర్వహించారు. వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్​ మున్సిపాలిటీలో తన బలాన్ని ఇంకా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది.