మారుతున్న రాజకీయ పరిణామాలు

ఎన్నికలు దగ్గరపడుతున్నందుకో, ప్రభుత్వ ప్రభ మసకబారుతున్నందుకో తెలియదు కానీ ఒక్కసారిగా ‘తెలంగాణ’ రాజకీయం వేడెక్కింది. ఏ వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా తిట్లను స్వీకరించడం అవమానం అనుకోవచ్చుగానీ, విమర్శపై అసహనం వ్యక్తం చేయడం సరైంది కాదు. 20 ఏళ్ల క్రితం టీఆర్ఎస్​ను కేసీఆర్‌‌ స్థాపించినపుడు ఈ నేలపై పుట్టిన చాలామంది ‘మాకో పార్టీ వచ్చిందని’ సంతోషపడ్డారు. ఉద్యమంలో కాంగ్రెస్‌‌, బీజేపీ మొదలుకొని తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. ఎందరో యువకులు ‘ఆత్మ బలిదానాలు’ చేసుకోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రంగా మిగులు బడ్జెట్‌‌తో ఏర్పాటైంది.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌‌ ఏది చేసినా అదొక వ్యూహంగా, ఎత్తుగడగా ప్రజలు భావించారు. ‘ఆంధ్రోడు’ అన్నా, భాషాపరమైన వెక్కిరింపులు, నాయకులపై తిట్ల దండకాలు చదివినా అదంతా తమకోసమే అనుకున్నారు. తెలంగాణ వచ్చాక ఇక్కడి వాళ్లపై జరిగే దాడిని ప్రజలు అలాగే స్వీకరిస్తారని అనుకోవడం సరైందికాదు. అంతకుముందు గొంగళిపురుగునైనా ముద్డాడుతానన్న కేసీఆర్‌‌ ‘యాక్సెసబిలిటీ’ ప్రజల్ని కలవని స్థితికి చేరేసరికి ప్రజలు వేరేరకంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ‘ప్రగతిభవన్‌‌- ఫాంహౌజ్‌‌’ అనే పదాలు నియంత పోకడల్లా ప్రజలు భావించడం మొదలుపెట్టారు. ఇటీవల కేటీఆర్‌‌ రంగంమీదకు వచ్చి బీజేపీపై, మోడీపై తర్కబద్ధంగా చెప్పే అంశాలను కూడా తిట్లతో, వ్యంగ్యంతో జోడించడం వల్ల ప్రజలు లోలోపల వ్యతిరేకించడం మొదలుపెట్టారు. పెద్దా, చిన్నా అనేది మన సమాజంలో ఓ ‘సంస్కారం’గా భావిస్తాం కదా! ఇక్కడి నేలలో రజాకార్లు, నిజాం చేసిన అకృత్యాలు ఇంకిపోయి ఉన్నాయి కదా! కొండా లక్ష్మణ్‌‌ బాపూజీ మొదలుకొని కొండా విశ్వేశ్వర్‌‌ రెడ్డి వరకు కేసీఆర్‌‌ వల్ల ఇబ్బంది పడ్డారని ప్రచారం జరిగినా, కేసీఆర్‌‌పై ఎదురు తిరగడానికి ఏ వ్యవస్థా సాహసించలేదు. ఆఖరుకు కొమ్ములు తిరిగిన ఆంధ్రామీడియా సైతం కేసీఆర్‌‌కు తలవంచే పరిస్థితి ఏర్పడినది. ఈ క్రమంలో కేసీఆర్‌‌తో తలపడేందుకు వచ్చిన బండి సంజయ్‌‌ను యువత నమ్మడం మొదలుపెట్టారు. ఇక్కడే తెలంగాణ రాజకీయాల్లో వేడి మొదలయ్యింది. అప్రతిహతంగా సాగుతున్న కేసీఆర్‌‌కు బండి సంజయ్‌‌ కంట్లో నలుసు అయ్యాడు. మంత్రులు, బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు బీజేపీతో రోజూ మాటల యుద్ధం చేస్తున్నారు. ప్రతి నాయకుడూ బండి సంజయ్‌‌నీ, మోడీని గట్టిగా తిట్టేస్తున్నారు. అది కేసీఆర్‌‌ దృష్టిలో పడేందుకో, వాళ్ల వ్యక్తిగత ప్రచారానికో తెలీదు. సంస్థాగతంగా జరుగుతున్న విషయాలపై చర్చలేకుండా ‘దూషణపర్వం’ గా సాగుతున్న రాజకీయాలను ప్రజలు ఎక్కువకాలం హర్షించలేరు.  కేసీఆర్‌‌ ఉద్యమకాలంలో ఆంధ్రావారిని తిడితే ఇక్కడి ప్రజలు చప్పట్లు కొట్టారు. కానీ ఈ గడ్డపై పుట్టిన వారిపై జరుగుతున్న దాడి ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేదే.  ఇపుడు తెలంగాణలో బీజేపీ రూపంలో బీఆర్‌‌ఎస్‌‌కు కొత్త సవాల్‌‌ ఎదురైంది. వాళ్లకు లీడర్లూ లేరు, క్యాడర్‌‌ లేరు అని విమర్శ చేసి, పక్కకు తప్పుకోవచ్చు. మరి అలా అయితే రోజూ అంతగా తిట్టడం ఎందుకు? అంటే ఉనికిలో లేని శత్రువుని స్పష్టించుకొని రాజకీయాలు నడపడం కూడా హిపోక్రసీ అవుతుంది కదా!? ఏదో జరుగుతుందనే ‘చింత’ ప్రభుత్వాన్ని వేధిస్తుందన్నది నిజం. ఎనిమిదేళ్లకే ఇంత శత్రువర్గం ఎందుకు ఏర్పడిందో కేసీఆర్‌‌ ఆలోచించాలి. జూపల్లి, పొంగులేటి బయటకు వచ్చి ఆలె నరేంద్ర లాగే తిట్టిపోశారు!?

ఆర్​ఎస్​ ప్రవీణ్​లో విధాన బలం, షర్మిలలో విమర్శల బలం

మరోవైపు షర్మిలకు స్క్రిప్ట్‌‌ రైటర్‌‌ ఎవరోగానీ అందరి ప్రతిపక్ష నాయకుల కన్నా గట్టి డైలాగులే ఉంటున్నాయి. ప్రతిపక్షాలవారు కేసీఆర్‌‌ను మాత్రమే అంటున్నారు. కానీ షర్మిల ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా వదలిపెట్టకుండా తిట్టిపోసింది. అయితే ఆ పార్టీ తెలంగాణ ప్రజల మెదళ్లలో ఇంకా సుప్తావస్థలోనే ఉండటం గమనార్హం. ఆర్‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌ నడుపుతున్న బీఎస్​పీ గతంలో ఎన్నో ఏళ్ల నుండి రాష్ట్రంలో ఉన్నా పెద్దగా ఉనికి లేదు. ‘స్వేరోస్‌‌’ పేరుతో ఇపుడు చదువుకున్న దళిత యువతను తనవెంట తిప్పుకున్న మాట వాస్తవం. బహుజనవాదం చెబుతున్న బీసీ వర్గాలు, అభివృద్ధి చెందిన కులాలు అతని వెంట నడవడం లేదు. ప్రధాన పార్టీలు పొత్తుతో కొన్ని సీట్లకే పరిమితం చేస్తాయి. పార్టీ నడపడం కన్నా ఆర్‌‌ఎస్‌‌పీ ఏ పార్టీలో చేరినా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.  ఆచార్య కోదండరాం కమ్యూనిస్టులకు రహస్యంగా, కాంగ్రెసుకు బాహాటంగా కరివేపాకులా ఉపయోగపడుతున్నాడు. ఇపుడు కేసీఆర్‌‌తో కొట్లాడే వ్యక్తి ‘‘స్వాతికమైన మార్క్స్‌‌’’లా ఉంటే తెలంగాణ ప్రజలు అంగీకరించరు. ప్రతిపక్ష పార్టీలు సహకరించకుంటే కోదండరాం నిలబడినా గెలవడం కష్టమే!

సంజయ్​ సామర్థ్యం!

బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై కొత్త ఆశలు పెట్టుకొంది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం చేతిలో పార్టీని పెట్టి సంజయ్‌‌తో ఇక్కడి ఓటు బ్యాంక్‌‌ను పటిష్టం చేయిస్తున్నారు. మొదట్లో ‘ఇతడేం చేస్తాడు పిల్లకాలువ!’ అనుకొన్నారు. ఇపుడు సముద్రంలా గర్జిస్తున్నాడు. అగ్గిపుల్లే అనుకుంటే అడవిని అంటబెడుతున్నాడు. ప్రజల్లో అతని చర్మిషా రోజురోజుకు పెరగడానికి అతని బోల్డ్‌‌ మనస్తత్వమే కారణం. పెద్ద అనుభవం ఉన్న నాయకుల్లా కాకుండా సాదాసీదాగా సామాన్య కార్యకర్తలాగా ముందుకు పోవడం ఇపుడు తెలంగాణ యువకులకు క్రేజీగా మారింది. బయట నుంచి వచ్చిన వాళ్లకు ఆ పార్టీ సిస్టం ఇంకా అర్థం కాక కొంత గందరగోళంగా అనిపిస్తోంది. బీజేపీలో ఇష్టంకన్నా సిస్టంకే విలువ ఎక్కువ. సంజయ్‌‌ నేతృత్వంలో గతంలో పట్టణాలకే పరిమితమైన పార్టీ పల్లెలకూ విస్తరించింది. సామాన్యులే నాయకులుగా పరిణామం చెందడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. ‘ఎన్నికల ఏజెంట్లే లేరు అనుకోవడం అమాయకత్వం. ప్రజల మనస్తత్వం మారితే అందరూ పుట్టుకొస్తారు’ అని బీజేపీ నాయకత్వం చెప్తున్న సమాధానం.

కమ్యూనిస్టుల తీరు

ఎంతో చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీలు మతోన్మాదం, కార్పొరేటీకరణ, మోదీ దేశాన్ని అమ్మేస్తాడు.. వంటి డైలాగులు తప్ప ఇంకోటి చెప్పడం లేదు. బీజేపీపై గుడ్డి వ్యతిరేకత’ తో తమ అస్థిత్వాన్ని కోల్పోయారు. తమ్మినేని, కూనంనేని లాంటివారు ఇంకా ‘సాయుధ పోరాటం’లోనే ఉన్నామని భ్రమ కల్పిస్తున్నారు. వాళ్ళను కేసిఆర్‌‌ కరుణిస్తే రెండు సీట్లు. లేదంటే మళ్ళీ ఎన్నికల నాటికి కొత్త బోగీలకు జత కావాల్సిందే.  కాంగ్రెస్‌‌ టికెట్‌‌తో గెలిచినా ఏదో రూపంలో కేసీఆర్‌‌ వైపు వెళ్తారని గత రెండు ఎన్నికలు స్పష్టంగా నిరూపించాయి. ఇప్పటికీ కేసీఆర్‌‌తో పొత్తు ఉంటే బాగుంటుందని పెద్దలు జానారెడ్డి మనసులో మాట బయటపెట్టారు. తర్వాత నాలుక్కరుచుకున్నా అతని మనోగతం బయటపడింది. కోమటిరెడ్డి కూడా అదే వ్యక్తం చేశాడు. పార్టీ ‘వాళ్ళ వ్యక్తిగతం’ అని 
కొట్టిపారేస్తోంది.

కాంగ్రెస్​–రేవంత్​ రెడ్డి

ఇక కాంగ్రెస్‌‌ విషయానికొస్తే రేవంత్‌‌రెడ్డి ఇచ్చిన ఆక్సిజన్‌‌ తప్ప కాంగ్రెసుకు స్వంతంగా ఉన్న ఓటు బ్యాంకు ఇవాళ అంత స్థాయిలో లేదు. మైనార్టీలు ఇపుడు కేసీఆర్‌‌ వెంట ఉన్నమాట వాస్తవం. దళిత ఓటు బ్యాంక్‌‌ కూడా చీలిపోయింది. చాలా భాగం చదువుకున్న దళిత యువత ఎవరు అవునన్నా కాదన్నా ఆర్‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌ను అనుసరిస్తున్నారు. దళిత వర్గాలు గతంలో లాగ కాంగ్రెసు వెంట నడిచే పరిస్థితి లేదు. రెడ్డి సామాజిక వర్గంలో కొందరు రేవంత్‌‌రెడ్డిని కోరుకుంటున్న మాట వాస్తవం. అయితే కాంగ్రెసుపార్టీలో కోమటిరెడ్డి, జగ్గారెడ్డి బాహాటంగా రేవంతరెడ్డిపై గుర్రుగా ఉన్నా కాంగ్రెసుకు ప్రాణం పోసేది రేవంత్ రెడ్డి అని క్రింది క్యాడర్‌‌ బలంగా నమ్ముతోంది. కానీ కాంగ్రెస్‌‌ –మోడీ అంశం తెలంగాణ ప్రజలకు ఎజెండా కానేకాదు. ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి, పెద్దలు జానారెడ్డి ఉన్నన్ని రోజులు కేసీఆర్‌‌ వ్యూహాలకు కొదువేలేదు అని కాంగ్రెస్‌‌ నాయకులే అంటుంటారు. రేవంత్‌‌రెడ్డి కూడా సోనియాగాంధీ, రాహుల్‌‌ గాంధీ పేర్లు చెబితే పడే ఓట్ల కన్నా రేవంత్‌‌రెడ్డి స్వతస్సిద్ధంగా మాట్లాడితే, ఆలోచిస్తే ఓట్లు వస్తాయి అన్నది నిర్వివాద అంశం. ఇపుడు మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా బీఆర్​ఎస్​కు చెందిన కె.కేశవరావు ప్రతిరోజూ మల్లిఖార్జునఖర్గే ప్రక్కన కూర్చోవటం వల్ల కాంగ్రెస్‌‌ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బతినడమేగాక, తెలంగాణలో కాంగ్రెస్‌‌ మూడోస్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.  పిచ్చెక్కి ఆఖరుకు రేవంత్‌‌రెడ్డి ప్రాంతీయపార్టీ పెడితే కాంగ్రెస్‌‌ నిండా మునిగే చాన్సు కూడా ఉంది. 

–శ్రీ కౌస్తుభ,సోషల్​, పొలిటికల్​ ఎనలిస్ట్