కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వివిధ నిర్మాణాలకు పెట్టిన పేర్లను ఒక్కొక్కటిగా కొత్త సర్కార్ మార్చేస్తోంది. ఇటీవల కరీంనగర్ రవాణా శాఖ ఆఫీస్‌లోని చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరును మార్చగా.. తాజాగా ఆర్‌అండ్ బీ గెస్ట్ హౌస్ పేరును మార్చడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత సర్కార్ హయాంలో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించిన పాపారావు(డీటీసీ) .. కరీంనగర్ జిల్లా ఆఫీసు ప్రాంగణంలోని చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ కు తన తండ్రి కృష్ణమనేని వెంకట్రామారావు పేరు పెట్టించారు.
జిల్లాకు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టడం ఏంటని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ పేరును తొలగించి.. కరీంనగర్ రాజకీయాల్లో ముద్ర వేసిన తన గురువు జువ్వాడి చొక్కా రావు పేరు పెడుతూ జీవో జారీ చేయించారు. అలాగే గత సర్కార్ హయాంలో కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అనే పేరులో కేసీఆర్ అనే మూడు అక్షరాలను హైలెట్ చేస్తూ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్‌కు బోర్డు తగిలించారు. కేసీఆర్ పేరు వచ్చేలా ఉన్న ఈ బోర్డును తొలగించాలని సిటీ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసిన రెండు రోజుల్లోనే ఆ బోర్డును ఆర్ అండ్ బీ అధికారులు తొలగించారు. ఆ బోర్డు స్థానంలో మంగళవారం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ అనే బోర్డును ఏర్పాటు చేశారు.