పొడగరి కాదు, చూడ్డానికి చాలా మామూలుగా కనిపిస్తారు. అయినా, చేతిలో స్టిక్, నడకలో ఠీవి ఆయనను చూసేట్టుగా చేసేవి. ఆయనే దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. నమ్మిన విలువల కోసం చివరికంటూ కట్టుబడ్డ తెలంగాణ మట్టిబిడ్డ ఆయన. చెన్నారెడ్డి రాజకీయ జీవితం అంతా వైకుంఠపాళీనే. కిందపడిన ప్రతిసారి అంతే స్పీడుగా ఆయన పైకి లేచారు. పార్టీలోనూ, ప్రభుత్వం లోపలా బయటా తనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా ‘డోంట్ కేర్’ అన్నారు. గుండె నిండా ధైర్యంతో అడుగు ముందుకేశారు. చెన్నారెడ్డి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పెద్దమంగళారం గ్రామంలో 1919 జనవరి 13వ తేదీన లక్ష్మారెడ్డి, శంకరమ్మ దంపతులకు పుట్టారు. అప్పట్లో తెలంగాణలో ఎక్కడ చూసినా ఫ్యూడల్ వ్యవస్థే ఉండేది. అప్పటికి నిజాం ఏలుబడిలో ఉన్న దక్కన్ ప్రాంతం వివిధ రకాల సామాజిక, రాజకీయ, స్వాతంత్ర్య పోరాట ఉద్యమాలతో చైతన్యం పులుముకుంటోంది. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు రాజకీయాలను కాకుండా హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ రాజకీయాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. నిజాం వ్యతిరేక పోరాటం, స్వాతంత్ర్య ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. జైలు జీవితం గడిపారు. తెలంగాణలో జరిగిన మూడు రాజకీయ పరిణామాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి గా నిలిచారు. మొదటిది 1948 ‘ఆపరేషన్ పోలో’ ద్వారా హైద్రాబాద్ సంస్థానం, ఇండియన్ యూనియన్ లో విలీనం కావడం. రెండోది 1956లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం కలిసి ‘ఆంధ్రప్రదేశ్’ గా ఏర్పడటం. మూడోది ‘ముల్కీ’ ఉద్యమాలు జరగడం. ఈ అన్ని సందర్భాల్లో ఆయన తెలంగాణ ప్రజల తరఫున తన గొంతు వినిపించారు. పోరాటంలో ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి తొలి నుండి ఎలుగెత్తి నినదించిన వారిలో చెన్నారెడ్డి తొలి వరసలో ఉన్నారు. అందుకే ఆయన నాయకత్వంలో 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊహించని స్థాయికి చేరుకున్నది.
1971 ఎన్నికల్లో ప్రజా సమితి గెలుపు
1971 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్) విజయం సాధించింది.మొత్తం 11 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లలో టీపీఎస్ కేండిడేట్లు గెలిచారు. ఈ గెలుపు మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత తెలంగాణ ప్రజా సమితిని ఆయన కాంగ్రెస్ లో కలిపేశారు. చెన్నారెడ్డి బలాన్ని, రాజకీయ చతురతను, ఇప్పటి ప్రభుత్వాలు సైతం ఆదర్శంగా తీసుకుని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ తరానికి చెన్నారెడ్డి సత్తా గురించి పెద్దగా తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ నుండి విస్మరణకు గురైన నాయకుల్లో ఈయన ఒకరుగా మిగిలారు. నాటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, ఆనాటి రాజకీయ పరిస్థితులు ఇలాంటి పరిస్థితిని కల్పించాయి.
నాయకుడయ్యాడు
భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా డాక్టర్ చెన్నారెడ్డి అడుగులు రాజకీయాల వైపే పడ్డాయి. ఆయన ప్రజా నాయకుడే కాదు జర్నలిస్టు కూడా. 1947-–48లలో నిజాం వ్యతిరేక పోరాటం జరుగుతున్న సమయంలో ‘హైదరాబాద్’ పేరుతో పత్రిక పెట్టారు. ఈ పత్రికను విజయవాడ నుంచి ప్రింట్ చేసి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేశారు. అలా చిన్న వయసు నుంచే ప్రజా ఉద్యమాలు, స్టూడెంట్ మూవ్ మెంట్స్ ఆయనను ఓ తిరుగులేని నాయకుడిగా తీర్చిదిద్దాయి.
బూర్గుల కేబినెట్ లో మంత్రిగా..
బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా చెన్నారెడ్డి పనిచేశారు. అక్కడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. రైతుల కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మంత్రిగా ఆయన పలు శాఖలు చూశారు. ఏ పోర్టుఫోలియో ఇచ్చినా చెన్నారెడ్డి మార్క్ ఉండేది. ఆయన దూరదృష్టి వల్లనే తెలంగాణలో రెండు ప్రముఖ యూనివర్శిటీలు వచ్చాయి. వ్యవసాయ వర్శిటీ ఆయన ఆలోచనల నుంచే పుట్టింది. కాకతీయ వర్శిటీ కూడా చెన్నారెడ్డి కి వచ్చిన ఆలోచనే.కేవలం తెలంగాణ ప్రాంతమే కాదు ఆంధ్రప్రాంతం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారు.
ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చిన మొనగాడు
డాక్టర్ చెన్నారెడ్డి హయాంలోనే తొలి సారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ బ్యాంక్ నిధులు వచ్చాయి. ఈ నిధులతో గోదావరి జిల్లాల్లో వరద ముంపు బెడద లేకుండా ఆయన చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావడం వెనకా మర్రి చెన్నారెడ్డి కృషి ఉంది. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పాలనలో ఏ రోజూ ఆ తేడా చూపించలేదు. ఇది సహజంగా తెలంగాణ మట్టి మనుషులకు ఉండే గుణం. అంతే కాదు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలోనే ఆంధ్రా ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. ఎన్నో కొత్త రోడ్లు వచ్చాయి. ఆస్పత్రులు వచ్చాయి. సదుపాయాలు పెరిగాయి.
1978లో తొలిసారి ముఖ్యమంత్రిగా..
మర్రి చెన్నారెడ్డి 1978లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రపదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన పదవిని కోల్పోయారు. కోల్పోయారు అనడం కంటే ఆంధ్ర ప్రాంత నాయకులు కుట్రలు చేసి ఆయనను దించేశారనడం కరెక్ట్ అవుతుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వం అమలు చేసిన చాలా స్కీంలు గతంలో చెన్నారెడ్డి సిఎంగా లేదా మంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలే. ముఖ్యమంత్రికి అంటూ ఒక ఫండ్ ఉండాలనేది పూర్తిగా చెన్నారెడ్డి ఆలోచన. ఆయన ఏ హోదాలో ఉన్నా ప్రజల కష్టాలు పట్టించుకున్నారు. పేదలు ఉండే వాడల్లో పాదయాత్ర నిర్వహించారు.
మంచి అడ్మినిస్ట్రేటర్ ..
చెన్నారెడ్డి మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన హయాంలో పెండింగ్ ఫైల్స్ అంటూ ఉండేవి కావు. సమస్యల పరిష్కారానికి వీలుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేవారు. అవసరమైన ఫండ్స్ రిలీజ్ చేసేవారు. పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చారు. సెక్రటేరియట్ టైమింగ్స్ ను ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1.30వరకు మార్చారు (తర్వాత మళ్లీ టైమింగ్స్ మారాయి). అలాగే స్కూల్స్ టైమింగ్స్ ను మార్చేశారు. పేదల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలు కూడా చేశారు.
సీఎం పదవి అంటే లెక్కే లేదు
1980 లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెన్నారెడ్డి చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు…‘‘ ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలి చిటికెన వేలు గోటితో సమానం.’’ ఎంతో ధైర్యం ఉంటే కాని ఏ రాజకీయ నాయకుడు ఈ మాటలు అనలేరు. ఇది సగటు తెలంగాణ వ్యక్తిలో ఉండే నైజం. ముఖ్యమంత్రి పదవి గురించి ఇంత ధైర్యంగా మాట్లాడిన లీడర్ ఆనాటి రాజకీయాల్లో చెన్నారెడ్డి మినహా మరెవరూ కనిపించరు.
అనేక రాష్ట్రాలకు గవర్నర్…
సహజంగా గవర్నర్ పదవి రాజకీయంగా రిటైరయిన తరువాత వస్తుంది. అయితే చెన్నారెడ్డి కి చిన్నవయసులోనే గవర్నర్ గా పనిచేసే అవకాశం లభించింది. ఒకటి కాదు చాలా రాష్ట్రాలకు ఆయన గవర్నర్ గా పనిచేశారు. 1974లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోక పోతే తానే దగ్గరుండి ఆ సమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఆ తర్వాత పంజాబ్ గవర్నర్ అయ్యారు. ఖలిస్తాన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో పంజాబ్ గవర్నర్ గా వెళ్లారు. అక్కడ కూడా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. చెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్ గా ఉన్న సమయంలోనే జయలలిత అక్రమాస్తుల కేసు ఆయన దగ్గరకు వచ్చింది. ఈ ఫైల్ ను ఆయన కేంద్రానికి పంపించారు. దీంతో జయలలిత కొంతకాలం జైల్లో కూర్చోవలసి వచ్చింది. ఇలా ఎక్కడ గవర్నర్ గా పనిచేసినా అందరితో శభాష్ అనిపించుకున్నారు.
–గొర్ల బుచ్చన్న
భయమంటే తెలియదు
డాక్టర్ చెన్నారెడ్డి స్వతహాగా ధైర్య శాలి. ఎవరినీ ఖాతరు చేయని వ్యక్తిత్వం ఆయనది. 1978 లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఆయనను కుర్చీ నుంచి దించివేయడానికి మత కలహాలు మొదలెట్టారు. సొంత పార్టీ కాంగ్రెస్ లోనే ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. అయినా చెన్నారెడ్డి ఏనాడూ చలించలేదు. పదవి పోతుందేమోనని భయపడలేదు. చదువు, ఆస్పత్రులు, సాగునీరు, పరిపాలన ఇలా అనేక రంగాల్లో ఇవాళ వచ్చిన మార్పులకు చెన్నారెడ్డి హయాంలోనే బీజం పడింది. చేపట్టిన పదవి ఏదైనా సరే బాధ్యతగా, మనస్ఫూర్తిగా పనిచేయడం ఆయన అలవాటు. తన విజన్ ద్వారా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన తెలంగాణ ప్రాంతపు తొలి తరం రాజకీయ నాయకుడు డాక్టర్ మర్రిచెన్నారెడ్డి.‘డాక్టర్ సాబ్’అని అనుచరులు అభిమానంగా పిలుచుకునే చెన్నారెడ్డి 1996 డిసెంబర్ 2న కన్నుమూశారు. ఎంతమంది నాయకులు వచ్చినా చెన్నారెడ్డి లేని లోటు తెలంగాణ కు తీరేది కాదు.