
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. అందుకోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యతను పొందిన ఈ యాత్రకు వేల సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశ ఉంది. దీంతో ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ సారి (2025) యాత్ర కోసం ఈసారి కొత్త నియమాలను తీసుకొస్తున్నారు ఆలయ ధర్మకర్తలు.
సంవత్సరానికి ఒక్కసారి వచ్చే చార్ ధామ్ యాత్ర కోసం భక్తులు, యాత్రికులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సారి అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) రోజున గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులు తెరవడంతో యాత్ర ప్రారంభం అవుతుంది. మే 2వ తేదీన కేదార్నాథ్ టెంపుల్ తెరుచుకుంటుంది. ఆ తర్వాత మే4వ తేదీన బద్రీనాథ్ గుడి తలుపులు తెరుచుకోవడంతో పూర్తిస్థాయి యాత్ర ప్రారంభం అవుతుంది.
ఈ సారి (2025) యాత్ర కోసం ఈసారి కొత్త నియమాలను తీసుకొస్తున్నారు ఆలయ ధర్మకర్తలు. చార్ ధామ్ యాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు నియమాలను తీసుకొస్తున్నట్లు కేదార్నాథ్-బద్రీనాథ్ పండా సమాజ్ తెలిపింది. చార్ ధామ్ యాత్రలో యూటూబర్స్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆలయ పరిసరాలలో ఎవరైనా షార్ట్స్ చేసినా.. యూట్యూబ్ వీడియో కంటెంట్ క్రియేట్ చేసిన కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా అలాంటి వారి టికట్లు రద్దు చేసి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. కొత్త నియమాలకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు.
భక్తులకు సదుపాయాలు:
యాత్రలో ఉండే భయంకరమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దాదాపు 10 స్థలాలలో సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా హరిద్వార్, రిషికేశ్, బ్యాసీ, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, హెర్బర్ట్ పూర్, వికాస్ నగర్, బార్ కోట్, భత్వారీ ప్రాంతాలను సహాయక చర్యల ప్రాంతాలుగా (హోల్డింగ్ ఏరియాస్) ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్స్, మందులు, అత్యవసర ఆహార సరఫరా తదితర సహాయక చర్యలు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు చార్ ధామ్ యాత్ర కోసం 9 లక్షలకు పైగా భక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. అత్యధికంగా 2 లక్షల 75 వేల మంది కేదార్నాథ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత బద్రీనాథ్ (2.24 లక్షలు), గంగోత్రి (1.38), యమునోత్రి (1.34) గా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి. యాత్ర ప్రారంభం కాగానే ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని ఆలయ యాత్ర నిర్వాహకులు తెలిపారు.