Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు 2.50 లక్షల మంది నమోదు

Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు 2.50 లక్షల మంది నమోదు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చార్ ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇది ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. తీర్థయాత్ర ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉండటంతో యమునోత్రి ధామ్, గంగోత్రి ధామ్, కేదార్‌నాథ్ ధామ్, బద్రీనాథ్ ధామ్ యాత్రల కోసం దాదాపు మూడు లక్షల మంది భక్తులు ఇప్పటికే యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. చార్ ధామ్ యాత్ర కోసం ఇప్పటివరకు 2.50 లక్షల మందికి పైగా భక్తులు నమోదు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ తెలిపింది. కేదార్‌నాథ్ ధామ్ కోసం 1.39 లక్షల రిజిస్ట్రేషన్‌లు, బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించేందుకు 1.14 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది.

చార్ ధామ్ యాత్ర 

యాత్రికుల కోసం గంగోత్రి- యమ్నునోత్రి తలుపులు ఏప్రిల్ 22న, కేదార్‌నాథ్ ఏప్రిల్ 25న, ఏప్రిల్ 27న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడతాయి. 

చార్ ధామ్ యాత్ర కోసం ఎలా నమోదు చేసుకోవాలి?

అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యాత్రికులు ఫోన్, వాట్సాప్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. https://registrationandtouristcare.uk.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా యాత్రికులు రిజర్వేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ రిజిస్ట్రేషన్ నమోదును మూడు రకాలుగా చేసుకోవచ్చు. 

  • మొదటిది పైన పేర్కొన్న వెబ్ సైట్ ద్వారా
  • మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో (ఆండ్రాయిడ్ యాప్ , ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది)
  • వాట్సాప్ ద్వారా (“యాత్ర” అని టైప్ చేసి, నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి +91 8394833833కు మెసేజ్ చేయాలి)

ప్రయాణీకులు మరో పద్దతిన కూడా నమోదు చేసుకోవచ్చు:

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించి.. అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఆన్‌లైన్ చెల్లింపులు లేదా బ్యాంక్‌లు, పోస్టాఫీసులలో ఆఫ్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ రుసుమును చెల్లించాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి.

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఫీజు

రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం భక్తులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ధామ్‌లను సందర్శించే ముందు తమను తాము నమోదు చేసుకోవడం ముఖ్యం. రిజిస్టేషన్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ లెటర్ ను పొందాలి. చార్ ధామ్‌లను సందర్శించేటప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్న ఈ లెటర్ ను మీతో తీసుకెళ్లండి. మీరు దేవాలయాలలోకి ప్రవేశించేందుకు ధృవీకరణ కోసం ఇది అవసరం. అలాగే రిజిస్ట్రేషన్ లెటర్‌తో పాటు మీకు సంబంధించిన ఏదైనా ఐడీ లేదా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లండి.