ఏసీబీ వలలో చారగొండ తహసీల్దార్

కల్వకుర్తి, వెలుగు : రిజిస్టర్ చేసుకున్న భూముల డాక్యుమెంట్లను యజమానికి ఇవ్వడానికి రూ.లక్ష డిమాండ్​ చేసిన నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ తహసీల్దార్​ నాగమణి శుక్రవారం ఏసీబీకి చిక్కింది. ఏసీబీ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలానికి చెందిన తాళ్ల రవీందర్ మాతృభూమి డెవలపర్స్ సంస్థ తరఫున చారకొండ మండలం సేరి అప్పారెడ్డిపల్లిలో 12 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నాడు. దానిని 12 మందికి ఎకరం చొప్పున అమ్మాడు. కొన్నవాళ్ల  వారి పేరున రిజిస్ట్రేషన్ చేయడం కోసం చారకొండ తహసీల్దార్​ నాగమణి కలిశాడు. ఆమె ఒక్కో డాక్యుమెంట్ కు రూ.25 వేల చొప్పున రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసింది. బతిమిలాడినా డాక్యుమెంట్ ఇవ్వకుండా రెండు నెలలుగా తిప్పుకుంటోంది. దీంతో విసిగిపోయిన బాధితుడు రవీందర్ మహబూబ్​నగర్​ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం రూ.లక్ష ఇవ్వడానికి చారకొండ తహసీల్దార్​ఆఫీసుకు వెళ్లాడు. రూ.75 వేలను వీఆర్వో భర్త వెంకటయ్యకు ఇచ్చి, మిగతా రూ.25 వేలు ఆపరేటర్ రాజుకు ఇవ్వాలని తహసీల్దార్​ నాగమణి చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే వారికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తన సిబ్బందితో రైడ్​చేసి తహసీల్దార్​నాగమణి, ఆపరేటర్ రాజు, వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శనివారం నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. మరోవైపు జడ్చర్లలోని తహసీల్దార్​ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.