- టూవీలర్లపై 18 శాతం చాలన్న ఫాడా
- డీలర్లకు కూడా ట్యాక్సును తగ్గించండి
- బడ్జెట్లో ఈ మేరకు ప్రపోజల్స్ పెట్టండి
న్యూఢిల్లీ: మనదేశ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటో డీలర్‌షిప్‌లు ఎదగడానికి పన్నుల భారాన్ని తగ్గించాలని, కొత్త విధానాలను అమలు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ఇందుకోసం కొన్ని సూచనలు కూడా చేసింది. తమ ప్రపోజల్స్‌ను బడ్జెట్లో పెడితే ఆటో సెక్టార్ పుంజుకుంటుందని, ఎకానమీకి మేలు జరుగుతుందని పేర్కొంది. వివరాలు ఇలా ఉన్నాయి. డిప్రిసియేషన్ (తరుగు) కు ఇండివిడ్యుయల్స్నే బాధ్యులను చేయాలి. దీనివల్ల ఎక్కువ మంది ఐటీ రిటర్నులు వేస్తారు. ఆటో ఇండస్ట్రీకి.. ముఖ్యంగా టూవీలర్ సెగ్మెంట్‌కు ఎక్కువ మేలు జరుగుతుంది. జీఎస్టీ వసూళ్లు మరింత పెరుగుతాయి. 2020 మార్చిలో ఆపేసిన డిప్రిసియేషన్ స్కీమును మరో ఆర్థిక సంవత్సరం కొనసాగించాలి. ఆటో ఇండస్ట్రీ ఆర్థికంగా పుంజుకోవడానికి టూవీలర్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలి. టూవీలర్లు ఇప్పుడు అందరికీ అవసరం. తక్కువ ఇన్కమ్ ఉన్న వారు కూడా వీటిని వాడుతున్నారు. ఇవి ఇక లగ్జరీ వెహికల్స్ ఎంతమాత్రమూ కావు. టూవీలర్లపై 28 శాతం జీఎస్టీతో పాటు రెండు శాతం సెస్ వసూలు చేయడం న్యాయం కాదు. లగ్జరీ వస్తువులకు మాత్రమే ఇంత భారీగా జీఎస్టీ ఉండాలి. పాత కార్ల బాడీని బట్టి జీఎస్టీ రేటు ప్రస్తుతం 12శాతం–18శాతం మధ్య ఉంది. 4,000 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉన్న వెహికల్స్‌పై12శాతం 4,000 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొడవుగల వెహికల్స్‌కు 18శాతం వసూలు చేస్తున్నారు. ఇక నుంచి పాత బండ్లకు ఐదు శాతమే వసూలు చేయాలి.
డీలర్ల సమస్యలనూ పట్టించుకోండి...
ఇతర బిజినెస్‌లతో పోలిస్తే ఆటో డీలర్లపై విపరీతంగా పన్ను ఉంది. రూ.400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించింది. ఆటో డీలర్‌షిప్ బిజినెస్లోని చాలా మంది ఇదే కేటగిరీలో ఉన్నందున, అదే పన్ను రాయితీని అన్ని ఎల్ఎల్పీ, యాజమాన్య, భాగస్వామ్య సంస్థలకు కూడా ఇవ్వాలి. దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆటోమొబైల్ డీలర్లకు పన్ను తగ్గింపు వల్ల ధైర్యం వస్తుందని ఫాడా వివరించింది. అయితే అసోసియేషన్ రిక్వెస్ట్‌పై ఆర్థికమంత్రిత్వశాఖ ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు.
టూవీలర్ సేల్స్ తగ్గినయ్
టూ వీలర్ అమ్మకాలు మనదేశంలో 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. మహమ్మారి వల్ల చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, బండ్ల రేట్లు పెరగడం, పెట్రోల్ రేట్లు ఎక్కువ కావడం ఇందుకు ముఖ్యమైన కారణాలు. ఉదాహరణకు 2020 డిసెంబరులో 11,27,917యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది డిసెంబరులో వీటి సంఖ్య 10,06,062 యూనిట్లు. గత ఏడాది ఏప్రిల్‌లో అయితే లాక్డౌన్ కారణంగా అమ్మకాలు సున్నాగా రికార్డయ్యాయి. మే నెలలోనూ చెప్పుకోతగ్గ స్థాయిలో సేల్స్ లేవు. గత ఏడాది ఏప్రిల్-–డిసెంబరు మధ్య కాలంలో అమ్మకాలు 2012 నాటిస్థాయికి తగ్గాయి. 2018 నుంచి ప్రతి ఏటా అమ్మకాలు పడిపోతూనే ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. తక్కువ ధరలకు వెహికల్ ఫైనాన్స్ దొరుకుతున్నా, ఈఎంఐ ఇచ్చినా, లాభం కనిపించడం లేదని అంటున్నారు. నోట్ల రద్దు నుంచి తమకు ఇదే పరిస్థితి ఉందని ఒక డీలర్ అన్నారు.