
- కొన్ని రోజులుగా నిలోఫర్ చుట్టూ వివాదాలు
- బ్లడ్ బ్యాంక్ అవినీతి, సీఎస్ఆర్ ఫండ్స్ గోల్మాల్ ఆరోపణలు
- కొంతమందిని తొలగించే అవకాశం ఉందంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: వివాదాలకు కేరాఫ్ గా మారిన నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ కు ప్రభుత్వం చార్జ్ మెమో ఇచ్చినట్లు తెలుస్తుంది. కొన్ని రోజులుగా ఆయనపై అనేక ఆరోపణలు వస్తుండటంతో ప్రభుత్వం ఇంటర్నల్ కమిటీతో ఎంక్వైయిరీ వేసింది. ఆ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఆసుపత్రిలో కొన్ని తప్పిదాలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం చార్జ్ మెమో ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలోనూ ఆయనకు చార్జ్ మెమో జారీ అయ్యింది. గతంలో డీఎంఈగా పనిచేసిన డాక్టర్ రమేశ్ రెడ్డికి ఇలాగే చార్జ్‌మెమో ఇష్యూ అయ్యింది.
మొదట్నుంచి వివాదమే
నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఇటీవల ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వహించారని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ గుర్తించింది. అలాగే సీఎస్ఆర్ ఫండ్స్ లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మిషన్ల కొనుగోలులో గోల్ మాల్ జరిగినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలోనే చార్జ్ మెమో ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత నిలోఫర్ కు ఇన్ చార్జీ సూపరింటెండెంట్ గా డాక్టర్ రవి కుమార్ ను నియమించారు. అయితే అప్పటికే ఆయనపై గతంలో ఇచ్చిన చార్జ్ మెమో ఉన్నది. కాగా, సిటీలోని కొన్ని ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్ల పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
కొందరు ఆసుపత్రుల నిర్వహణలో ఫెయిల్ అయినట్లు, మరికొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిని తొలగించే అవకాశం ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇలాంటి విషయాలపై స్టడీ చేసేందుకు స్పెషల్‌గా ఒక టీం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.